English | Telugu
'బలగం' గాయకుడు మొగిలయ్య ఆరోగ్యం విషమం!
Updated : Apr 11, 2023
'బలగం' సినిమా అంతా ఒక ఎత్తయితే, క్లైమాక్స్ ఒకెత్తు. క్లైమాక్స్ లో తమ గాత్రంతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు మొగిలయ్య-కొమురమ్మ దంపతులు. వారి ప్రతిభపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు దంపతులకు కష్టమొచ్చింది. తన గాత్రంతో ఎంతగానో ఆకట్టుకున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్ లోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు తాజాగా గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. దీంతో మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో.. తమను ఆదుకోవాలంటూ ఆయన భార్య కొమురమ్మ కన్నీరుమున్నీరు అవుతోంది. హాస్పిటల్ బెడ్ పై మొగిలయ్య ఉండగా, తమను ఆదుకోవాలంటూ కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మొగిలయ్య త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఆయన మునుపటిలా పాటలు పాడాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు మెరుగైన వైద్యం కోసం మొగిలయ్యను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.