English | Telugu
కుర్ర హీరో హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడు!
Updated : Apr 11, 2023
ఓ వైపు విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న సుహాస్, మరోవైపు హీరోగానూ రాణిస్తున్నాడు. 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' సినిమాలలో హీరోగా నటించి మెప్పించిన సుహాస్.. త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది.
హీరోగా సుహాస్ సినిమాల ఎంపిక ఆకట్టుకుంటుంది. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా 'కలర్ ఫోటో' నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును సైతం అందుకోవడం విశేషం. ఇక ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన 'రైటర్ పద్మభూషణ్' మంచి వసూళ్లు రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. మల్లిఖార్జున సెలూన్ షాపు ముందు నిల్చొని, తన గ్యాంగ్ తో కలిసి కథానాయకుడు డప్పు కొడుతున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే ఈ విలేజ్ ఎంటర్టైనర్ తో సుహాస్ మరోసారి ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది.
బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రంతో దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. దీంతో పాటు 'ఆనందరావ్ అడ్వంచర్స్' అనే మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు సుహాస్.