English | Telugu
అనుష్క శెట్టితో నవీన్ పొలిశెట్టి.. టైటిల్, పోస్టర్ అదిరిపోయాయి!
Updated : Mar 1, 2023
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రధారులుగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా అనుష్కకి 48వది కాగా, నవీన్ కి మూడోది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అనుష్క, నవీన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో షెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడియన్ గా నవీన్ కనిపించనున్నారు. ఈ సినిమాకి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు.
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి పేర్లు కలిసేలా ఈ చిత్రానికి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఇదే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫారెన్ లో ఉన్న శెట్టి, హైదరాబాద్ లో ఉన్న పొలిశెట్టి ఎలా కలిశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అనుష్క మునుపటిలా గ్లామర్ గా కనిపిస్తుండగా.. నవీన్ మరోసారి తనదైన శైలిలో వినోదాన్ని పంచడానికి రెడీ అన్నట్లుగా ఉన్నాడు.
ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. రధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నిరవ్ షా, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.