English | Telugu
మహేష్ తల్లిగా రామ్ అక్క
Updated : Aug 2, 2013
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రం గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇందులో మహేష్ నెగెటివ్ పాత్రలో కనిపిస్తాడని, ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో మహేష్ తో కలిసి బాలీవుడ్ నటి సోఫి స్టెప్పులేయనుందని... ఇలా రోజుకో వార్త వినిపిస్తుంది. అయితే తాజా వార్త ఏమిటంటే... ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం చెల్లెలు అను హాసన్ మహేష్ కు తల్లి పాత్రలో నటిస్తుందట. అయితే ఇందులో మహేష్ చిన్ననాటి పాత్రలో గౌతమ్ నటిస్తున్నాడు కాబట్టి... గౌతమ్ కి తల్లిగా అను నటిస్తుందని సమాచారం.
అయితే ఇదంతా ఇలా ఉంటే... ఇంతకు ముందు అను హాసన్ నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. అను హాసన్ తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన "ఎవరైనా ఎపుడైనా" చిత్రంలో వదినగా నటించింది. అదే విధంగా తాజాగా రామ్ నటించిన "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలో రామ్ కు అక్క పాత్రలో నటించింది. నటన పరంగా ఆమె పాత్రకు అను న్యాయం చేసినప్పటికీ కూడా... ఈ చిత్రాలు విజయం సాధించలేకపోయాయి. మరి మహేష్ నటిస్తున్న ఈ 60కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో అను హాసన్ లక్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.
14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల చేయనున్నారు.