English | Telugu
Game Changer : పాపం చరణ్ ఫ్యాన్స్.. దెబ్బ మీద దెబ్బ కొడుతున్న 'గేమ్ ఛేంజర్'
Updated : Nov 10, 2023
'గేమ్ ఛేంజర్'ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఆ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే చరణ్ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించడంతో మా హీరో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడని అప్పుడు ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై అసలు క్లారిటీనే లేదు. ఇలాంటి తరుణంలో చరణ్ ఫ్యాన్స్ కి మరో ఊహించని షాక్ తగిలింది.
ఓ వైపు షూటింగ్ ఆలస్యంతో పాటు, లీకుల బెడద కూడా 'గేమ్ ఛేంజర్'ని ఇబ్బంది పెడుతోంది. మొదట్లో షూటింగ్ సమయంలో సెట్స్ నుంచి చరణ్ లుక్ కి సంబంధించిన పలు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇది చాలదు అన్నట్టు ఇటీవల 'జరగండి జరగండి' అనే సాంగ్ లీక్ అయింది. సాంగ్ లీక్ అవ్వడమే ఫ్యాన్స్ కి నిరాశ అంటే.. ఆ సాంగ్ శంకర్ సినిమా సాంగ్ స్థాయిలో లేదంటూ ట్రోల్స్ రావడం అంతకంటే నిరాశ కలిగించే విషయం. సరే ఎలాగూ లీక్ అయింది కదా అని.. ఆ సాంగ్ ని అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. దీపావళికి 'జరగండి' సాంగ్ విడుదల చేస్తామని తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. అయితే ఓ వైపు దీపావళికి రెండు రోజులు కూడా లేదు. ఇంతవరకు కనీసం సాంగ్ ప్రోమో అప్డేట్ రాలేదు. తాజా అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ దీపావళికి రావడం లేదట. ఆల్రెడీ లీక్ అయిన ఈ ఫస్ట్ సింగిల్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఇంకా ఎన్నిరోజులు ఎదురుచూడాలో ఏంటో.