English | Telugu

మ‌ళ్లీ ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కి వెళ్తున్న అమితాబ్‌!

ఇండియ‌న్ సినిమా షెహ‌న్‌షా బిగ్ బీ అమితాబ్ మ‌ళ్లీ షూటింగ్‌కి వెళ్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. త‌న హెల్త్ గురించి అభిమానులు మెచ్చే అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవ‌ల ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌లో బిగ్ బీ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. బాలీవుడ్ హీరోయిన్లు దీపిక ప‌దుకోన్‌, దిశా ప‌ఠాని న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బిగ్ బీ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఎమోష‌న‌ల్‌గా సాగే ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో పాటు చాలా స‌న్నివేశాల్లో క‌నిపిస్తార‌ట బిగ్ బీ. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే బ‌చ్చ‌న్ సాబ్‌కి ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కండ‌రాలు చీలాయి. ప‌క్క‌టెముక‌ల‌కు గాయాల‌య్యాయి.

హైద‌రాబాద్‌లో ప్ర‌థ‌మ చికిత్స్ తీసుకున్న అమితాబ్, వెంట‌నే ముంబైకి వెళ్లారు. తీవ్ర‌మైన నొప్పిని భ‌రించ‌లేక‌పోతున్నానంటూ త‌న బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆయ‌న చాలా వ‌ర‌కు కోలుకున్నారు. ఇంకా నొప్పి ఉంద‌ని కూడా చెప్పారు. అయినా, త‌న‌ను ప‌ని పిలుస్తోంద‌ని అన్నారు. చేతినిండా ప‌ని ఉండ‌టం క‌న్నా అదృష్టం ఏం ఉంద‌ని అన్నారు. విశ్రాంతి తీసుకున్న‌ది చాల‌ని, కాల్షీట్లు ఫుల్ అవుతున్నాయ‌ని త‌న‌దైన శైలిలో చెప్పారు బ‌చ్చ‌న్ సాబ్‌. 80 ఏళ్ల వ‌య‌సులో న‌ట‌న ప‌ట్ల ఆయ‌న క‌న‌బ‌రుస్తున్న ఇష్టాన్ని చూసి ఫిదా అవుతున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఇదికదా క‌మిట్‌మెంట్ అంటే అంటూ బిగ్ బీనీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ``డేమేజ్ అయిన శ‌రీరాన్ని రిపీర్  చేశాను. అది చేయడానికి చాలా శ్ర‌మకు లోన‌య్యాను. నా అభిమానులు నా ప‌ట్ల క‌న‌బ‌రిచిన అనుర‌క్తికి స‌దా ధ‌న్యుడిని. శ్రేయోభిలాషులు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.

ప‌నిలోనే నాకు విశ్రాంతి. నా రిబ్‌, పాదాలు ఇంకా నాకు పూర్తిగా స‌హ‌క‌రించ‌డం లేదు. అయినా నేను వాటిని సంధానం చేస్తూ ముందుకు న‌డుస్తున్నాను`` అని అన్నారు. అయితే అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కే హాజ‌ర‌య్యారా? మ‌రేదైనా సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.