English | Telugu
ఉపాసన సీమంతానికొచ్చిన బన్నీ!
Updated : Apr 24, 2023
రామ్‌చరణ్, ఉపాసన దంపతలు త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు. ఆ ఇద్దరూ 2012లో పెళ్లాడారు. ఇన్నాళ్లకు తొలిసారి గర్భం దాల్చింది ఉపాసన. దాంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. పెళ్లైన దగ్గర్నుంచీ చరణ్, ఉపాసన అన్యోన్యత గురించి ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగేవాళ్లు గొప్పగా చెబుతూ వస్తుంటారు. 'మిస్టర్ సీ' అంటూ చరణ్‌ను సంబోధిస్తూ సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.
ఇటీవల ఆస్కార్‌కి రెడీ అవుతున్న ఈ దంపతుల మీద అమెరికన్ యూట్యూబ్ చానల్ వేనిటీ ఫెయిర్ ఓ వీడియో రికార్డ్ చేసింది. వేనిటీ ఫెయిర్ ఇప్పటిదాకా అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోల రికార్డులను అది బద్దలుకొట్టింది. దుబాయ్‌లో జరిగిన ఉపాసన సీమంతం ఫొటోలు కూడా వేగంగా వైరల్ అయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో మరో రెండు వేడుకలు వైభవంగా జరిగాయి. ఒక వేడుకలో ఉపాసన పింక్ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుకులీనారు. రామ్‌చరణ్ తనకు నచ్చిన నలుపు రంగు దుస్తుల్లో ఒకచోట, వైట్ షర్ట్ విత్ స్మార్ట్ చినోస్‌లో మరోచోట స్మార్ట్ గా కనిపించారు.
ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్, వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు. అలాగే చిరంజీవి-సురేఖ దంపతులు, చరణ్ చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో పాటు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి, సుష్మిత, శ్రీజ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని ఆనందోత్సాహంలో మునిగిపోయారు. ఇక చరణ్ మేనమామ అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలో మెరిశాడు. ఉపాసనతో అతను కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చరణ్, అర్జున్ మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారానికి బన్నీ రాక ఫుల్‌స్టాప్ పెట్టిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.