English | Telugu
‘కంగువ’ షూటింగ్‌లో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు!
Updated : Nov 23, 2023
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’. ఈ సినిమా షూటింగ్ చెన్నయ్‌లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. రోప్ కెమెరా అదుపు తప్పి సూర్యపై పడిరదట. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయమైందని తెలుస్తోంది. దీంతో అతన్ని వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ఈరోజు షూటింగ్‌ని క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న సూర్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదంలో సూర్యకు తీవ్రస్థాయిలో గాయాలు అవ్వలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చిత్ర యూనిట్ చెప్పినట్టు సమాచారం.
సూర్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా ‘కంగువ’ తెరకెక్కుతోంది. 2డితోపాటు 3డి, ఐమాక్స్ ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చాలా హైరేంజ్‌లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా కావడంతో షూటింగ్ పరంగా చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటివరకు అజిత్‌తో ఎక్కువ సినిమాలు చేసిన శివ యాక్షన్ మూవీస్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘కంగువ’ అతని కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన సినిమాగా నిలవబోతోంది. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య ఆరు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.