English | Telugu
అఫీషియల్.. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్
Updated : Apr 19, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 15 న ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టగా.. తాజాగా హీరోయిన్ సైతం సెట్స్ లో అడుగుపెట్టడం విశేషం.
'ఓజీ'లో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించే అవకాశముందని ఇటీవల న్యూస్ వినిపించింది. తాజాగా మేకర్స్ హీరోయిన్ గా ఆమె పేరును ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ప్రియాంక మోహన్ తెలుగులో బిగ్ స్టార్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడం ఇదే మొదటిసారి. గతంలో తెలుగులో నాని సరసన 'గ్యాంగ్ లీడర్', శర్వానంద్ సరసన 'శ్రీకారం'లో నటించిన ప్రియాంక.. తన మూడో సినిమాకి ఏకంగా పవర్ స్టార్ తో నటించే అవకాశం దక్కించుకుంది.
ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ లో ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు చిత్రీకరణ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.