English | Telugu

పవన్ గోపాల గోపాల‌ రివ్యూ

తోట‌లో గులాబీకున్న ప‌రిమ‌ళ౦.. మ‌నింటి బాల్క‌నీలో పెంచుతున్న రోజాకి ఉండ‌దు.
ఎక్క‌డో ఆర్టిఫిషియాలిటీ. గులాబీకి ఉన్న ప‌రిపూర్ణ‌త్వం ఆ పువ్వుకి అంట‌దు. రీమేక్ సినిమా క‌థ‌లూ ఇలానే ఉంటాయి. ఎక్క‌డో బాగా ఆడింది క‌దా, అని గులాబీలా ఇంటికి తెచ్చుకొంటే వాడిపోతుంది. ప‌రిమ‌ళం పాడైపోతుంది. రీమేక్ సినిమాలు హిట్ట‌యిన చ‌రిత్ర ఉంది గానీ, అద్భుతాలు సృష్టించిన దాఖ‌లాలు లేవు. దానికి కార‌ణం వ‌ర్జినాలిటీ మిస్ అవ్వ‌డం.

ఇప్పుడు గోపాల గోపాల విష‌యానికొద్దాం. బాలీవుడ్‌లో అద్భుతం సృష్టించిన ఓ మై గాడ్ కి ఇది రీమేక్‌. బాలీవుడ్ తోట‌లో విక‌సించిన గులాబీని టాలీవుడ్‌లో మొల‌కెత్తించాల‌ని చూశారు. గులాబీ అయితే ఉంది. మ‌రి ఆ ప‌రిమ‌ళ౦ మాటేంటి?? ఆ సౌరభాల సంగ‌తేంటి?? వ‌ర్జినాలిటీని మించిన అద్భుతం ఈ గోపాల‌ గోపాల‌లో ఉందా? ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న మ్యాజిక్ చూపించాడా..?? రండి.. చూసేద్దాం.

గోపాల రావు (వెంకటేష్) ది దేవుడి విగ్ర‌హ‌ల్ని అమ్ముకొనే వ్యాపారం. దేవుడి బొమ్మ‌లే కాదు, భ‌క్తినీ వ్యాపారం కోసం వాడుకొ౦టాడు. భార్య మీనాక్షి(శ్రియ) మాత్ర౦ ప‌ర‌మ భ‌క్తురాలు. ఓసారి భూకంపం వ‌ల్ల త‌న షాపు కూలిపోతుంది. దాదాపు కోటి రూపాయ‌ల న‌ష్టం. భీమా కంపెనీకి వెళ్తే.. `యాక్ట్ ఆఫ్ గాడ్` అంటూ ఓ నిబంధ‌న చూపించి... నీకు భీమా వ‌ర్తించ‌దు.. అంటారు. ఏం చేయాలో తెలియ‌ని గోపాల్రావు.. ఏకంగా దేవుడిపైనే కేసు వేస్తాడు. అక్బర్ ఖాన్(మురళి శర్మ) అనే లాయ‌రు స‌హ‌కారంతో మతపెద్దలు లీలాధర్(మిథున్ చక్రవర్తి) , సిద్దేశ్వర్(పోసాని కృష్ణమురళి) కి నోటీసులు జారీ చేస్తారు. దేవుడి ఏజెంట్ల‌యిన వీళ్లైనా బీమా డబ్బులు చెల్లించాలి, లేదంటే.. దేవుడైనా దిగిరావాలి అంటూ వాదిస్తాడు. గోపాల్రావు వాద‌న వింత‌గా ఉన్నా... స‌మాజం మొత్తం క‌దిలివ‌స్తుంది. యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఇలాంటి 700 కేసులు న‌మోద‌వుతాయి. చివ‌రికి భ‌క్తికీ వ్య‌క్తికి మ‌ధ్య పోరుగా మారిపోతుంది. గోపాల్రావుపై క‌క్ష క‌ట్టిన మ‌త పెద్ద‌లు... అత‌నినిపై దాడికి కుట్ర చేస్తారు. స‌రిగ్గా అదే స‌మ‌య‌లో శ్రీ కృష్ణుడు (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) దిగి వ‌స్తాడు. గోపాల్రావుకి కృష్ణుడు ఏ దారి చూపించాడు..? ఈ యుద్ధంలో ఓ నాస్తికుడిని ఎలా గెలిపించాడు..?? అనేదే గోపాల గోపాల క‌థ‌.

ఓ మైగాడ్ లో చూసిన క‌థే ఇది. క‌థ‌లో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. స్ర్కీన్ ప్లే కూడా దాదాపుగా యాజ్ టీజ్ గా దింపేశారు. (అలాంట‌ప్పుడు క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం అని డాలీ పేరు ఎందుకు పెట్టుకొన్నారో). ఓ మైగాడ్ సినిమాని య‌ధావిధిగా ఫాలో అయిపోవ‌డానికే చిత్రబృందం ఇష్ట‌ప‌డింది. ఎక్క‌డా రిస్క్ చేయ‌ద‌ల‌చుకోలేదు, దాంతో పాటు సొంత తెలివితేట‌లు వాడుకోద‌ల‌చుకోలేదు. ఆఖ‌రికి అక్బ‌ర్ ఇంటి అడ్ర‌స్ వెతుక్కొంటూ వెళ్లిన సీన్ కూడా మ‌క్కీకి మ‌క్కీ దింపేశారు. రీమేక్ క‌థ ఎంచుకొన్న‌ప్పుడు ఎదుర‌య్యే మొద‌టి ప్ర‌శ్న ఇదే. సినిమాకి మ‌క్కీకి మ‌క్కీ దించాలా? లేదంటే సొంత తెలివి తేట‌లు ఉప‌యోగించుకోవ‌చ్చా అనే ద‌గ్గ‌రే ఆ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది. గోపాల గోపాల విష‌యంలో డాలీకి ఆ అవ‌కాశం ఇవ్వ‌లేద‌నుకొంటా. సీడీని ముంద‌రెట్టుకొని... డిట్టో దింపే ప్ర‌య‌త్నం చేశారు.

అది కొంత వ‌ర‌కూ ఈ సినిమాని కాపాడింది. ఓ మైగాడ్‌లో హైలెట్‌గా నిలిచిన కొన్ని పాయింట్లు.. రీమేక్‌లోనూ ర‌క్తి క‌ట్టించాయి. ముఖ్యంగా కోర్టులో వాద‌న‌లు. నాస్తికుల వైపు నుంచే కాదు,భ‌క్తుల వైపు నుంచి ఆలోచించినా.. `అరె.. ఇది క‌రెక్టే క‌దా..` అనిపిస్తుంది. దేవుడే స్వ‌యంగా కింద‌కు దిగిరావ‌డం, ఓ నాస్తికుడికి స‌హాయం అందించ‌డం, త‌న విశ్వ‌రూపం చూపించి, కోర్టు కేసులో గెలిపించి తిరిగివెళ్లిపోవ‌డం ఈ క‌థ‌లోని మూలాంశాలు. వాటిని కూడా యాజ్ టీజ్‌గా దింపేశారు. సో... అక్క‌డి వ‌ర‌కూ సినిమా బాగానే ఉంది. కాక‌పోతే కోర్టు సీన్లో వాద‌న‌లు మ‌రీ మ‌రీ రీపీట్ అయిన ఫీలింగ్‌. ఒకే విష‌యం చుట్టూ క‌థ‌ని న‌డిపించే ప్ర‌య‌త్నం చేయడం వ‌ల్ల చూసిన సీనే మ‌ళ్లీ చూసిన భావ‌న‌. బుర్రా సాయిమాధ‌వ్ మాటలు బాగున్నాయి.

ఓ మైగాడ్ చూడ‌క‌పోతే.. ఈ సినిమా ఓ లెవిల్లో ఎక్కేస్తోంది. లేదంటే మ‌క్కీకి మ‌క్కీ దింపేశార‌న్న అసంతృప్తికి ప్రేక్ష‌కుడు లోన‌వుతాడు. అంతెందుకు బాగా పేలాయి అనుకొన్న డైలాగులు కూడా హిందీ మాట‌ల‌కు ట్రూ ట్రాన్సిలేష‌న్‌. ఫ‌స్టాఫ్‌లో ప్రేక్ష‌కులు కుదురుగా కూర్చోరు. `ప‌వన్ ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా` అని ఎదురుచూస్తుంటారు. సెకండాఫ్‌లో ప‌వ‌న్ మ్యాజిక్ చేస్తాడా, చేస్తాడా అని ఎద‌రుచూస్తుంటారు. ఈలోగా శుభం కార్డు ప‌డిపోతుంది. ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో చూద్దామ‌నుకొంటే వాళ్ల ప‌ప్పులేం ఈ సినిమాలో ఉడ‌క‌వు. కాక‌పోతే త‌న‌కేదో ఇమేజ్ ఉంద‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని క‌థ‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మార్చేయ‌కుండా, హీరోయిజం చూపించ‌కుండా.. క‌థ‌కి న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆఖ‌రికి ఓ ఫైట్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. కానీ దాన్నీ ప‌వ‌న్ కోసం వాడుకోలేదు. ప‌వ‌న్ ఇలా వ‌చ్చి. అలా వెళ్లాడు.. అంతే! ప‌వ‌న్ కోసం పూన‌కం వ‌చ్చే డైలాగులేం రాసుకోలేదు. ఆలోచింప‌జేసే డైలాగులే ప‌లికించారు. అవి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి స‌రిపోతాయో లేదో మ‌రి.

వెంకీ, ప‌వ‌న్.. ఇద్ద‌రు క్రేజ్ ఉన్న హీరోలు క‌ల‌సి ఓ సినిమా చేయ‌డానికి, అదీ ఓమైగాడ్‌ని రీమేక్ చేయ‌డానికి ముందుకొచ్చారు. సంతోషం. తెలుగు సినిమా కొత్త‌దారులు వెదుకుతోంది అన‌డానికి అదో నిద‌ర్శ‌నం. వెంకీ ఎప్ప‌ట్లా త‌న బలాల్ని న‌మ్ముకొన్నాడు. ఎమోష‌న్ సీన్స్‌లో ఆక‌ట్టుకొన్నాడు. ప‌వ‌న్‌లో ఓ దేవుడ్ని చూసిన‌ప్పుడు వెంకీ త‌న మార్క్ న‌ట‌న బ‌య‌ట‌కు తీశాడు. ఇక ప‌వ‌న్‌.. చాలా క్లాస్ గా క‌నిపించాడు. కృష్ణుడి పాత్ర చేస్తున్నా.. అనే మాట అత‌ని మెద‌డులో బ‌లంగా నాటుకు పోయింది. అందుకే ఎగ‌స్ట్రాల జోలికి వెళ్ల‌కుండా హుందాగా క‌నిపించాడు. అదే స‌మ‌యంలో కొన్ని చోట్ల బిగుసుకుపోయిన‌ట్టు క‌నిపించింది. ఒక్క‌టి నిజం.. ఇలాంటి ప‌వ‌న్‌ని ఇంత‌కు ముందు సినిమాల్లో మీరు చూసుండ‌రు. శ్రియ పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. మిథున్ అక్క‌డ ఎలా చేశాడో, ఇక్క‌డా అదే చేశాడు. అంత‌కు మించిన స్పెషాలిటీ ఏం లేదు.

అనూప్ అందించిన‌ది మూడే పాట‌లు. పాట‌ల‌కు స్కోప్ లేదు. ఆడియోలో ఉర్రూత‌లూగించిన భాజే.. పాట తెరపై స‌రిగా ఆన‌లేదు. కానీ.. ఆర్‌.ఆర్ తో మాత్రం ఆక‌ట్టుకొన్నాడు. కెమెరా ప‌నిత‌నం బాగుంది. సెకండాఫ్‌ని కాస్త ట్రిమ్ చేయాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల్ని తొల‌గించాల్సింది. నిర్మాణ విలువ‌లు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌కి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. డాలీ.. ఓ మైగాడ్‌ని మార్చే సాహ‌సం చేయ‌లేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీసి త‌న బాధ్య‌త నెర‌వేర్చాడు.

గోపాల గోపాల క‌చ్చితంగా పండ‌గ సినిమానే. ఇద్ద‌రు హీరోలు క‌ల‌సి చేసిన సంద‌డి ఇది. అయితే ఒకే ఒక్క ష‌ర‌తు. ఓ మైగాడ్ చూసిన వాళ్ల‌కి ఈ సినిమా ఆన‌క‌పోవ‌చ్చు. ఒక‌వేళ చూడ‌క‌పోతే.. న‌చ్చుతుంది. చూసుంటే ఆ మొమొరీని చెరిపివేసి అప్పుడు థియేట‌ర్లోకి అడుగుపెట్టండి.

రేటింగ్ 3/5

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.