English | Telugu

పుష్ప‌తో ఫుల్‌స్టాప్ పెట్ట‌నున్న ఫాహ‌ద్‌?

మ‌ల‌యాళం ఆర్టిస్టు ఫాహ‌ద్ ఫాజిల్‌కి ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో అద్భుతంగా న‌టిస్తార‌నే పేరుంది ఫాహ‌ద్‌కి. బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ప్రాజెక్టులే అందుకు గొప్ప ఎగ్జాంపుల్స్. పుష్ప సినిమాలో పార్టీ లేదా పుష్ప అంటూ ఫాహ‌ద్ అడిగే తీరుకు ఫిదా అయిపోయారు ప్రేక్ష‌కులు. అయితే వెండితెర‌మీద ఫాహ‌ద్ విల‌నీ కేర‌క్ట‌ర్స్ కి చెక్ ప‌డుతుంద‌నే వార్త‌లు అందుతున్నాయి.

ఆయ‌న విల‌న్ రోల్స్ కి నో చెప్పే ఉద్దేశంలో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు ఫాహ‌ద్‌. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌లో న‌చ్చిన రోల్స్ వ‌చ్చిన‌ప్పుడు చేస్తున్నారు. ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్ విక్ర‌మ్ సినిమాలోనూ న‌టించారు.

హీరోగా, విల‌న్‌గా,సైకోగా, కామెడీ ఆర్టిస్ట్ గా, కేమియో రోల్స్ లో మెప్పించే న‌టుడిగా మంచి పేరు ఉంది ఫాహ‌ద్ ఫాజిల్‌కి. ఆయ‌న ప్ర‌స్తుతం పుష్ప‌2లో న‌టిస్తున్నారు. భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర సెకండ్ చాప్ట‌ర్‌లో వేరే లెవ‌ల్లో ఉంటుంద‌ని, ప్రేక్ష‌కులు ఎంత ఊహించుకున్నా, దాన్ని మించేలాగానే సుకుమార్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నార‌ని అన్నారు ఫాహ‌ద్‌.

ఇటీవ‌ల విడుద‌లైన మారి సెల్వ‌రాజ్ సినిమా మామ‌న్న‌న్‌లో ర‌త్న‌వేలు అనే భూస్వామిగా న‌టించారు ఫాహ‌ద్‌. అత్య‌ద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది ఆయ‌న కేర‌క్ట‌ర్‌కి. మామ‌న్న‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ ఫాహ‌ద్ పేరే ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోంది. విల‌న్‌గా ఇంత పేరు తెచ్చుకున్న ఫాహ‌ద్ ఇప్పుడు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇక‌పై హీరోగానే కొన‌సాగాల‌ని అనుకుంటున్న‌ట్టు మాలీవుడ్ న్యూస్‌.

అయితే దీని గురించి ఫాహ‌ద్ ఫాజిల్ ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. ఆయ‌న హీరోగా త్వ‌ర‌లో ఓ త‌మిళ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఇలాంటి వార్త‌లొస్తున్నాయ‌న్న‌ది మ‌రో వెర్ష‌న్‌.