English | Telugu
నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన కిచ్చా!
Updated : Jul 9, 2023
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఓ లీగల్ కేసుకు సంబంధించి వార్తల్లో నిలిచారు. తనపై ఓపెన్‌గా ఆరోపణలు చేసినందుకుగానూ నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేష్‌కు కిచ్ఛా సుదీప్ లీగల్ నోటీసులు పంపారు. కన్నడ నటుడు కిచ్చాసుదీప్ తమ దగ్గర రెమ్యునరేషన్ తీసుకున్నారని, తమతో సినిమా చేయడానికి అంగీకరించారని, అయితే ఇప్పటివరకు డేట్లు కేటాయించలేదని ఆరోపించారు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేష్. ఈ విషయం మీదే వారిద్దరి మీదా పరువు నష్టం కేసు వేశారు కిచ్చా సుదీప్.
తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. పరువు నష్టం కలిగించినందుకుగానూ రూ.10 కోట్లు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎంఎన్ కుమార్, సుదీప్ కలిసి గతంలో పలు సినిమాలు చేశారు. రంగా (S.S.L.C), కాశీ ఫ్రమ్ విలేజ్, మాణిక్య మరియు ముకుంద మురారితో పాటు సుదీప్ నటించిన పలు సినిమాలకు బ్యాకింగ్ ఉన్నారు ఈ నిర్మాతలు. స్వాతి ముత్తు, మై ఆటోగ్రాఫ్‌తో పాటు పలు సినిమాలను పంపిణీ చేశారు.
సుదీప్ తన దగ్గర రెమ్యునరేషన్ తీసుకుని ఎనిమిదేళ్లవుతున్నా కాల్షీట్లు కేటాయించడం లేదని నిర్మాత ఎం ఎన్ కుమార్ ఆరోపించారు. కోటి గొబ్బ, విక్రాంత్ రోణ తర్వాత తనతో సినిమా చేస్తానని మాటిచ్చారని, అయితే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండి తనను పట్టించుకోవడం లేదని అన్నారు. సుదీప్‌ని కలవడానికి ప్రయత్నిస్తే కుదరడం లేదని ఆరోపణలో పేర్కొన్నారు.
సుదీప్ కాల్షీట్ ఇస్తే వెంటనే ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తానని అన్నారు. నంద కిశోర్ డైరక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. దీని మీద కిచ్చా స్పందించాలన్నారు. అయితే సుదీప్ ఇదంతా విని, పరువు నష్టం దావా వేయడం అనుకోని ట్విస్ట్ అయింది.