English | Telugu
ధనుష్ - మారి సెల్వరాజ్ కొత్త సినిమా షురూ
Updated : Apr 10, 2023
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలకూ పర్ఫెక్ట్ గా సరిపోయే నటుల్లో ముందు వరుసలో ఉంటారు ధనుష్. ఇటీవల సార్‌తో పెద్ద హిట్ కొట్టిన ధనుష్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మిగిలిన హీరోలందరూ ప్యాన్ ఇండియా రేంజ్ గురించి ఆలోచిస్తుంటే, ఏకంగా ఇంటర్నేషనల్ డయాస్ మీద పంచెకట్టుతో కూర్చున్న హీరో ధనుష్. ఓ వైపు నటుడిగా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ, నిర్మాతగా కూడా ఎప్పుడూ ముందుండాలని అనుకుంటారు ఈ హీరో. లేటెస్ట్ గా ఆయన మారి సెల్వరాజ్ సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సౌత్ నిర్మిస్తోంది. వండర్ బార్ ఫిల్మ్స్ కూడా నిర్మిస్తోంది. ఆదివారం రాత్రి ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ధనుష్.
మారి సెల్వరాజ్‌తో మరోసారి సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను కేవలం నటించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాను తన వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. జీ స్టూడియోస్ సౌత్‌తో అసోసియేట్ కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్నెన్నో కారణాల వల్ల ఇది నాకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓం నమః శివాయ అంటూ ట్వీట్‌లో స్పెషల్‌గా మెన్షన్ చేశారు ధనుష్. మారి సెల్వరాజ్ - ధనుష్ కాంబినేషన్ అనగానే అందరికీ కర్ణన్ సినిమా గుర్తుకొస్తుంది. కల్ట్ సినిమాగా తెరకెక్కించారు కర్ణన్‌ని. ఆ సినిమాకు కూడా ఇవ్వనంత హైప్ ఈ సినిమాకు ధనుష్ ఇస్తున్నారంటేనే, సబ్జెక్ట్ వేరే రేంజ్ అని అంటున్నారు కోలీవుడ్ విమర్శకులు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలై సక్సెస్ అయింది. ప్రస్తుతం ధనుష్ చేతినిండా సినిమాలున్నాయి. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీ రోల్ చేస్తున్నారు.