English | Telugu
సుమన్ కోసం మెగాస్టార్ స్పెషల్ వీడియో!
Updated : Feb 16, 2023
సీనియర్ యాక్టర్ సుమన్ కెరీర్ డౌన్ ఫాల్ కావడానికి, ఆయన జైలుకి వెళ్లడానికి మెగాస్టార్ చిరంజీవి కారణమంటూ కొందరు ప్రచారం చేశారు. దానిని ఇద్దరూ హీరోలు పలు సందర్భాల్లో ఖండించారు. తమ మధ్య మంచి అనుబంధముందని చెప్పుకొచ్చారు. తాజాగా చిరంజీవి తనకు సుమన్ తో ఉన్న అనుబంధాన్ని మరోసారి పంచుకున్నారు.
'నీచల్ కులం' అనే తమిళ సినిమాతో రంగప్రవేశము చేసిన సుమన్ తెలుగు, తమిళ, కన్నడతో పాటు పలు భాషలలో 150కి పైగా సినిమాలలో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో రాణించారు. సుమన్ సినీ ప్రయాణం 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఆయనకు వీడియో రూపంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
"మై డియర్ బ్రదర్ సుమన్.. నటుడిగా మీరు 45 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 10 భాషలలో 150 కి పైగా సినిమాలు చేయడం అద్భుతమైన విషయం. మీ కమిట్‌మెంట్ కి, డెడికేషన్‌కి 45 ఏళ్ళ మీ సినీ ప్రయాణం నిదర్శనం. ఇంత గొప్ప విజయం సాధించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు. ఇలాగే మీరు మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ మెగాస్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు.