English | Telugu
BMW Trailer: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్.. సంక్రాంతికి ఫుల్ మీల్స్!
Updated : Jan 7, 2026
ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ నమ్మకాన్ని నిజం చేసేలా ఉంది.
రెండు నిమిషాలకు పైగా నిడివితో రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ ఆద్యంతం సరదాగా సాగింది. "ఈ మధ్య గన్ లు, కత్తులు, ఫైట్ లు.. ఓ తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు" అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తన రీసెంట్ సినిమాలకు భిన్నంగా ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేశానని చెప్పకనే చెప్పేశాడు. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ పాత్రను చూపించారు. అలాగే ట్రైలర్ లో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. ఇక జనరేటర్ లో పంచదార పొసే సీన్ అయితే.. ఆ మధ్య మంచు ఫ్యామిలీలో గొడవలను గుర్తుచేసేలా సరదాగా ఉంది. ఇక ట్రైలర్ చివరిలో 'ఏడుకొండవాడా వెంకటేశా' అంటూ రవితేజ స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ సినిమాల పండగ. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ చూస్తుంటే.. అసలుసిసలు పండగ సినిమా అనిపిస్తోంది.
ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా.. సత్య, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.