English | Telugu
మెగా156 దర్శకుడి గౌరవ దర్శకత్వంతో ప్రారంభమైన అశ్విన్ బాబు సినిమా
Updated : Nov 20, 2023
హిడింబ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్విన్ బాబు ఇప్పుడు తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. అశ్విన్ సరసన దిగంగనాసూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చలన చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులంతా హాజరవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా టాక్ అఫ్ ది ఫిలిం న్యూస్ గా మారింది.
మెగాస్టార్ 156వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నవశిష్ట మల్లిడి అశ్విన్ నూతన చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించాడు. అలాగే నాంది లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల క్లాప్ ని ఇవ్వగా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేసాడు. ఓంకార్ సినిమా స్కిప్ట్ ని అందచేయడంతో పాటు ప్రముఖ అగ్ర నిర్మాతలైన ఠాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.
గంగఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ హిడింబ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అశ్విన్ బాబు మా సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మా సినిమా సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా అని కూడా ఆయన అన్నారు.
అప్సర్దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతుంది.హైపర్ ఆది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా దాశరధి శివేంద్ర కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నారు. వికాస్ బడిస సంగీతాన్ని అందిస్తున్నాడు.