English | Telugu
ధనుష్ 50లో కుర్ర భామ
Updated : Aug 4, 2023
భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన లేటెస్ట్ మూవీ D 50పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ధనుష్ కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ కావటంతో పాటు ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కూడా. భారీ తారాగణం ఈ చిత్రంలో కనిపించనుంది. అందులో సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్, జయరామ్ ఇంకా చాలా మందే ఈ లిస్టులో ఉన్నారు. కాగా.. ఇప్పుడు మరో కుర్ర హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.
పలు తమిళ చిత్రాల్లో బాల నటిగా మెప్పించిన అనైకా సురేంద్రన్ ఈ మధ్యలో కథానాయికగా రాణించేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్‌గానూ, కీలక పాత్రధారిగానూ మెప్పించింది. ఇప్పుడు ఏకంగా ధనుష్ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నిజంగా ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ధనుష్ తన 50వ సినిమా కోసం ఇది వరకు కనిపించనటువంటి సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. అదే గుండు లుక్. ఈ మధ్య ధనుష్ గుండు లుక్‌తో ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు కెప్టెన్ మిల్లర్ సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. అలాగే ఇళయరాజా బయోపిక్‌లోనూ ఆయన మెప్పించబోతున్న సంగతి విదితమే. ఈ బయోపిక్‌ను బాలీవుడ్ దర్శకుడు ఆర్.బాల్కీ తెరకెక్కించబోతున్నారు.