English | Telugu
అట్లీతో మూవీ.. బన్నీ ట్వీట్‌కి అర్థమదేనా?
Updated : Sep 14, 2023
‘జవాన్’తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాధించారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. ఆయన డైరెక్షన్‌లో కింగ్ ఖాన్ షారూఖ్ చేసిన ‘జవాన్’ మూవీ రూ.500 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి బాక్సాఫీస్ పోరులో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే వార్తలు గట్టిగానే వినిపించాయి. కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్స్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకు కారణం బన్ని వేసిన ట్వీట్ అని రుజువుగా చూపెడుతున్నారు. అసలు అంతలా వార్తలు బయటకు రావటానికి బన్ని వేసిన ట్వీట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే,
గురువారం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ‘జవాన్’ సినిమా సాధించిన బ్లాక్ బస్టర్‌ను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అల్లు అర్జున్ ట్వీట్‌పై స్పందించారు. ఐకాన్ స్టార్‌కి ధన్యవాదాలను తెలియజేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ నాకు కావాల్సింది థాంక్స్ కాదు.. సూపర్ హిట్ పాటలు అని అన్నారు. బన్ని ఏ పాటల గురించి చెప్పారా? అని అందరూ కొద్ది సేపు ఆలోచించారు. అయితే కొంతసేపటికీ అందరికీ స్ట్రైక్ అయిన విషయమేమంటే, అట్లీతో బన్ని సినిమా కన్ఫర్మ్ అయ్యిందని. అందుకనే తను అలా అనిరుద్‌ని అడిగారని అంటున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం తెలియటం లేదు కానీ.. బన్నీ టైట్ షెడ్యూల్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా వచ్చే ఏడాది చివరలోనో, ఆ నెక్ట్స్ ఇయర్ కానీ ఉండొచ్చునని సినీ సర్కిల్స్ అంటున్నాయి.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 ది రూల్ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అది కాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. వీటి తర్వాతే అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ మూవీ ఉంటుందనేది టాక్.