English | Telugu
"7త్ సెన్స్" రివ్యూ
Updated : Oct 26, 2011
1,600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని మూడవ పల్లవరాజు అపర బుద్ధుడిగా పిలువబడే బోధి ధర్ముడు (సూర్య) అద్భుతమైన ఆయుర్వేద వైద్యుడు...అలాగే అంతకంటే అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ వీరుడు. అతను చైనాకి వెళ్ళి అక్కడి ప్రజలకు తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యాన్ని, మార్షల్ ఆర్ట్స్ ని వారికి నేర్పించి, అక్కడి కరాటే, కుంఫూ, నింజా, సమురాయ్ వంటి యుద్ధవిద్యలకు మూలమైన షావోలిన్ టెంపుల్ ఆవిర్భవించటానికి ఆయనే ఆద్యుడవుతాడు.
ప్రస్తుతానికి వస్తే శుభ (శృతి హాసన్) అనే అమ్మాయి జెనెటిక్ ఇంజినీరింగ్ లో డి.యన్.ఎ. మీద పరిశోధనలు చేస్తూ తన పరిశోధనలను అమెరికాకి, చైనాకి పంపిస్తుంది. చైనా ప్రభుత్వం మన దేశం మీద బయోకెమికల్ వార్ జరపటానికీ, శుభని చంపటానికీ డాంగ్లీ (జానీ ట్రై గూయెన్) అనే మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణుడైన వ్యక్తిని ఇండియాకి పంపిస్తారు. ఇక్కడ అరవింద్ (సూర్య) అనే సర్కస్ లో పనిచేసే కుర్రాడు శుభని ప్రేమిస్తాడు. కానీ ఆమె బోధిధర్ముడి వంశం గురించి, ఆయన డి.యన్.ఎ.కి మ్యాచ్ అయ్యే డి.యన్.ఎ. వారిలో ఎవరికైనా ఉంటుందేమోనని పరిశోధిస్తుంటుంది.
ఆ పరిశోధనలో భాగంగా బోధిధర్ముడి వంశస్తుడైన అరవింద్ ని కలుస్తుంది. ఈ లోగా డాంగ్లీ ఇండియాకి వస్తాడు.. అతను శుభని చంపాడా...? అరవింద్ ప్రేమ ఫలించిందా...? శుభ పరిశోధన విజయవంతమవుతుందా...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడండి.
విశ్లేషణ - దర్శకుడిగా మురుగదాస్ శక్తి స్వామర్థ్యాలు అతని గత చిత్రాలు "గజిని", "స్టాలిన్" వంటి చిత్రాలే చెప్పాయి. మురుగదాస్
సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనే అంచనాలను ఈ సినిమా అందుకుంది. మన పూర్వీకుల గొప్పతనం గురించీ, మన ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలూ, సంస్కృతుల గురించీ పట్టించుకోకుండా మనం ఎంత నిర్ల్యక్షంగా ఉన్నామో ఈ చిత్రంలో చాలా చక్కగా విశదీకరించాడు దర్శకుడు మురుగదాస్. అలాగే బోధి ధర్ముడి ఎపిసోడ్, అలాగే చైనా ఎపిసోడ్ ఇంట్రవెల్ తర్వాత, క్లైమాక్స్ కి ముందు ఓపెన్ చేసినట్టయితే సినిమా ఇంకా పెద్ద హిట్టయ్యి ఉండేది. గ్రాఫిక్స్ ని మురుగదాస్ ఈ చిత్రంలో వాడుకున్న తీరు బాగుంది. ఈ చిత్రం లోని నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
నటన - ఈ చిత్రంతో నటుడిగా సూర్య మరో మెట్టు పైకెక్కాడని చెప్పొచ్చు. బోధి ధర్ముడిగా, అరవింద్ గా ద్విపాత్రల్లో సూర్య నటన
చాలా బాగుంది. అలాగే శృతి హాసన్ తాను గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశముండే పాత్రల్లో కూడా నటించగలనని ఈ
చిత్రంతో నిరూపించుకుంది. విలన్ గా "కుంఫూ హాజిల్" వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జానీ ట్రై గూయెన్ తన పాత్రకు న్యాయం
చేశాడు. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం - కొత్తగా ఉండి బాగుంది. పాటలు వినటానికి కూడా బాగున్నాయి...రీ-రికార్డింగ్ బాగుంది.
కెమెరా - చాలా బాగుంది...ఈ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్ లా అందించటంలో కెమెరా పనితనం మెచ్చుకోతగినది.
మాటలు - డబ్బింగ్ సినిమాలా కాకుండా ఒక స్ట్రైట్ చిత్రంలోని మాటల్లా ఈ చిత్రంలోని మాటలను శ్రీ రామకృష్ణ వ్రాయటం ముదావహం.
పాటలు - భువనచంద్ర వ్రాసిన పాటల్లో భగ్న ప్రేమికుడిగా సూర్య పాడే పాట సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా బాగుంది.
మిగిలిన పాటలు కూడా బాగున్నాయి.
ఎడిటింగ్ - ఆంథోనీ ఎడిటింగ్ చాలా బాగుంది.
కొరియోగ్రఫీ - బాగుంది.
యాక్షన్ - చాలా బాగుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి.
ఒక కొత్తదనం ఉన్న సినిమా మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ సినిమా చూడండి.
తెలుగువన్ రేటింగ్ -3/5