English | Telugu

అందాల నటనకు మారుపేరు అక్కినేని

అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20 వ తేదీన కృష్ణాజిల్లాలో, గుడివాడ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నప్పుడు నాటకాలలో ఆడవేషాలు వేసేవారు...బెజవాడ (విజయవాడ) రైల్వేస్టేషన్ లో అక్కినేని నాగేశ్వరరావుని చూసిన స్వర్గీయ శ్రీ ఘంటసాల బలరామయ్యగారు ఆయన్ని సినిమాల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. "సీతారామజననం" చిత్రంలో శ్రీరాముడిగా నటించిన అక్కినేని నాటి నుండి నేటి "శ్రీరామరాజ్యం" చిత్రం వరకూ తన నటప్రస్థానాన్ని అద్వితీయంగా, అత్యద్భుతంగా, అనితర సాధ్యంగా కొనసాగిస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు వెళ్లిన మొదట్లో ఆయన నడకలో, నటనలో నాటకాల్లో వేసిన ఆడవేషాల పుణ్యమాని కాస్త ఆడతనం కనిపించేదట. దాన్నిండి బయటపడి...తనను తాను ఒక హీరోగా అక్కినేని మలచుకున్న తీరు శతథా అభినందనీయం.

 

 

ఆ తర్వాత ఆయన "బాలరాజు, దేవదాసు, విప్రనారాయణ, మహాకవి కాళిదాసు,ఇద్దరు మిత్రులు, సుమంగళి, దొంగ రాముడు, మాంగల్యబలం, ప్రేమించి చూడు, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం" వంటి అనేక అద్భుత చిత్రాల్లో తన అమేయప్రతిభతో నటించి తెలుగునేల నలుచెరగులా ప్రేక్షకజన నీరాజనాలందుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆదికవి వాల్మీకిగా నటించిన "శ్రీ రామరాజ్యం" చిత్రం అక్టోబర్ నెలలో విడుదలకు ముస్తాబవుతోంది. తన నటనలో ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్తదనాన్ని, హావభావప్రదర్శనలో తన దైన ముద్రను, డైలాగ్ మాడ్యులేషన్ లో తనదైన శైలినీ ఆయన సాధించారు...నటనకు ఒక భాష్యంగా, ఒక నిర్వచనంగా, అసలు అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక నడుస్తున్న నట విశ్వవిద్యాలయంలా మారిన ఆయన్ని వరించిన బిరుదులెన్నో...ఆయనకు జరిగిన సన్మానాలెన్నెన్నో...అటువంటి నడిచే నటవిశ్వవిద్యాలయం నటసామ్రాట్, పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.