English | Telugu
అబ్బా బాబీ.. వినాయక్ దర్శకత్వంలో రవితేజ!
Updated : Oct 26, 2023
టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ మాస్ దర్శకుల్లో వి.వి. వినాయక్ ఒకరు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. కొంతకాలంగా వెనకబడిపోయారు. చివరిగా తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన 'ఇంటిలిజెంట్' 2018 లో విడుదలై పరాజయం పాలైంది. ఆ తర్వాత 'శీనయ్య' అనే సినిమాతో నటుడిగా మారాలని చూసి డ్రాప్ అయ్యారు. దర్శకుడిగా 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. అదీ నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తెలుగులో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట.
'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మీ', 'కృష్ణ', 'అదుర్స్' ఇలా వినాయక్ కెరీర్ లో పలు విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అప్పట్లో వినాయక్ తో సినిమా చేయడానికి హీరోలు పోటీ పడేవారు. అలాంటి వినాయక్ దర్శకత్వంలో తెలుగు సినిమా వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. ఈ గ్యాప్ ని కవర్ చేసేలా, ఒకప్పటి వినాయక్ ని గుర్తు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారట. మాస్ మహారాజా రవితేజని దృష్టిలో పెట్టుకొని వినాయక్ ఓ అదిరిపోయే కథని సిద్ధం చేశారట. ఇప్పటికే వినాయక్-రవితేజ మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
వినాయక్, రవితేజ కాంబినేషన్ లో గతంలో 'కృష్ణ' సినిమా వచ్చింది. 2008 సంక్రాంతికి విడుదలైన ఈ యాక్షన్ కామెడీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని కామెడీ, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ-బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో బ్రహ్మానందం పోషించిన బాబీ క్యారెక్టర్, 'అబ్బా బాబీ' అనే డైలాగ్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తాయి.