English | Telugu
పాపం బెల్లంకొండ.. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సినిమా అటకెక్కింది!
Updated : Oct 26, 2023
కొన్ని సినిమాలు ప్రకటనకే పరిమితమవుతాయి. కొన్ని సినిమాలు కొంత షూటింగ్ జరుపుకున్నాక ఆగిపోతాయి. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ చంద్ర కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా అలాగే అయిపోయిందని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. ఏవో కారణాల వల్ల అటకెక్కినట్లు సమాచారం.
'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్.. హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటిదాకా అతను తొమ్మిది సినిమాల్లో హీరోగా నటించగా అందులో 'రాక్షసుడు' మాత్రమే విజయాన్ని అందించింది. అసలే విజయాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న బెల్లంకొండకి.. ప్రకటించిన సినిమాలు ఆగిపోవడం అనేది మరింత ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల క్రితం స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా 'స్టూవర్ట్‌పురం దొంగ' అనే సినిమాని ప్రకటించాడు. అయితే అదే కథతో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చేయడంతో.. బెల్లంకొండ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో ఆ ప్రాజెక్ట్ కి బదులుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం బెల్లంకొండ ఈ సినిమాతో బిజీగా ఉన్నాడని అనుకుంటుంటే.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ మూవీ ఆగిపోయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
బెల్లంకొండ పరిస్థితి ఇలా ఉంటే, డైరెక్టర్ సాగర్ చంద్ర పరిస్థితి మరోలా ఉంది. అతను దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నప్పటికీ.. ఎందుకనో సినిమా సినిమాకి కొన్నేళ్ళు గ్యాప్ వస్తుంది. 2012 లో వచ్చిన 'అయ్యారే'తో దర్శకుడిగా పరిచయమై ఆకట్టుకున్న సాగర్ చంద్ర నుంచి రెండో సినిమా రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఆయన డైరెక్షన్ లో రెండో సినిమాగా రూపొందిన 'అప్పట్లో ఒకడుండేవాడు' 2016 లో విడుదలై ఆకట్టుకుంది. దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నప్పటికీ.. మూడో సినిమా రావడానికి మరో ఆరేళ్ళు పట్టింది. దర్శకుడిగా మూడో సినిమాగా పవన్ కళ్యాణ్ తో చేసిన 'భీమ్లా నాయక్' 2022 లో విడుదలై సాగర్ చంద్రకి మంచి విజయాన్ని అందించింది. అయినప్పటికీ నాలుగో సినిమా అంత తేలికగా మొదలవ్వలేదు. కొత్త సినిమాని ప్రకటించడానికే ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు బెల్లంకొండతో నాలుగో సినిమాని ప్రకటించాడు అనుకుంటే.. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ లెక్కన సాగర్ చంద్ర డైరెక్షన్ లో నాలుగో సినిమా రావాలంటే ఎంతో టైం పడుతుందో ఏంటో!.