English | Telugu

మా హీరోకి శ్రీలీల అవసరం లేదంటున్న ఫ్యాన్స్‌!

ప్రస్తుతం శ్రీలీలకు హీరోయిన్‌గా ఉన్న క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు ఇప్పటికి తెలుగులో రిలీజ్‌ అయినవి రెండే. కానీ, లెక్కకు మించిన సినిమాల్లో బుక్‌ అయింది శ్రీలీల. డజనుకు పైగా సినిమాలను లైన్‌లో పెట్టింది. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూనే చదువుపై కూడా దృష్టి పెడుతోంది. అందుకే కొన్ని సినిమాలను వద్దనుకుంటోంది. రామ్‌తో చేసిన స్కంద ఈనెల 28న రిలీజ్‌ కాబోతోంది. అలాగే బాలకృష్ణతో చేస్తున్న భగవంత్‌ కేసరి, వైష్ణవ్‌తో చేస్తున్న ఆదికేశవ కూడా రెడీ అవుతున్నాయి. అంతేకాదు, ఇకపై శ్రీలీల నటించిన సినిమాలు నెలకొకటి చొప్పున రిలీజ్‌ అయ్యే అవకాశాలు వున్నాయంటున్నారు. కొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్ళాల్సి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పక్కన పెడుతోందని సమాచారం. 

విజయ్‌ దేవరకొండతో చేయబోయే సినిమా, రవితేజతో చేయబోయే సినిమాని వదులుకుందని తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండతో చేసే సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆ సినిమా నుంచి శ్రీలీల బయటికి వచ్చేసిందట. ఆమె లేకపోయినా ఫర్వాలేదు మాకు రష్మిక ఉందని విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ అంటున్నారట. విజయ్‌ ఫ్యాన్స్‌కి శ్రీలీల అంటే ఎందుకంత కోపం అనేది అర్థం కాలేదు. విజయ్‌, రష్మిక కాంబినేషన్‌లో గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే శ్రీలీల తమ హీరో సినిమాలో లేకపోయినా ఫర్వాలేదు అంటున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో బాగా చర్చిస్తున్నారు.