English | Telugu
ప్రభాస్ 'స్పిరిట్'లో విజయ్ దేవరకొండ!
Updated : Sep 18, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. 'సలార్', 'కల్కి 2898 AD', మారుతి ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' లైన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట.
విజయ్ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా విజయ్, సందీప్ లకి స్టార్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత సందీప్ తెలుగులో సినిమాలు చేయనప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సందీప్ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటనలు రాగానే వాటిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు విజయ్-సందీప్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఎందరో 'అర్జున్ రెడ్డి' అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోసమే అన్నట్టుగా ఇప్పుడో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. 'స్పిరిట్' కోసం విజయ్ ని రంగంలోకి దింపబోతున్నాడట సందీప్.
'స్పిరిట్'లో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో ప్రభాస్ కనిపించనున్నాడు. ఇందులో విలన్ పాత్ర కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ రోల్ కోసం విజయ్ పేరుని సందీప్ సూచించగా ప్రభాస్ ఓకే చెప్పాడని, విజయ్ సైతం ఆ రోల్ చేయడానికి వెంటనే అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమైతే 'స్పిరిట్'లో ప్రభాస్-విజయ్ ల పోరు చూడబోతున్నాం అన్నమాట. సందీప్ హీరోల పాత్రలను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతాడు. ఇక ఇప్పుడు విలన్ గా విజయ్ ని తీసుకుంటున్నాడు అంటే.. ఆ రోల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.