English | Telugu
మెగాస్టార్‌తో సమంత రొమాన్స్... వర్కవుట్ అవుతుందా?
Updated : Sep 16, 2023
దేశంలోని వివిధ భాషల్లో సినిమా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. చిత్ర పరిశ్రమ అంటే నార్త్, సౌత్ అంటూ ఉంటాం. కానీ, ఇప్పుడు ఆ బ్యారియర్స్ ఏమీ లేనట్టు కనిపిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి హీరోలు, హీరోయిన్లు బాలీవుడ్ ఎక్స్‌పోర్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నార్త్‌లోనూ మన హీరోలకు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు, తమిళ్‌లో తళక్కుమన్న హీరోయిన్లు బాలీవుడ్‌లోనూ తమ అందచందాలతో, టాలెంట్‌తో అక్కడి ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నారు.
విషయానికి వస్తే... ఇటీవల విడుదలైన ‘ఖుషి’ మంచి విజయాన్ని సాధించి విజయ్ దేవరకొండకి, సమంతకి మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఆ మధ్య అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేసి యూత్‌ని ఉర్రూతలూగించిన సమంత నార్త్‌లోనూ అదరగొట్టింది. దాంతో బాలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలైంది. హిందీలో ‘ది ఫ్యామిలీ మ్యాన్2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లలో నటించింది. ‘సిటాడెల్’ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో సమంతకు ఓ భారీ ఆఫర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించే సినిమాలో సమంత హీరోయిన్ అనుకుంటున్నారు. తమిళ్‌లో అజిత్‌తో ‘బిల్లా’ తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విష్ణువర్థన్ ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌తో ‘పంజా’ చిత్రం చేశాడు.
ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు విష్ణువర్థన్. ‘జవాన్’ చిత్రంలో షారూఖ్ ఖాన్, నయనతార జంట అందర్నీ ఆకట్టుకుంది. అందుకే సల్మాన్‌ఖాన్ సినిమాలోనూ సౌత్ హీరోయిన్ అయితే బాగుంటుందని నిర్మాత కరణ్ జోహర్ భావించారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన సమంతతో పాటు, త్రిష, అనుష్క పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే సమంతను ఓకే చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరి కాంబినేషన్ ఎలా ఉంటుంది? వీరిద్దరి రొమాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనే విషయాలు పక్కన పెడితే సమంత ఓకే అంటూ వెలువడే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.