English | Telugu
క్రేజీ కాంబినేషన్ అనే పేరున్నా.. బజ్ మాత్రం సున్నా!
Updated : Aug 23, 2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఖుషి’. ఇది క్రేజీ కాంబినేషన్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి బజ్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. దానికి గల కారణాలు ఏమిటనేది చెప్పాలంటే...
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ వంటి హిట్ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకొని హీరోగా తనకంటూ ఓ కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అతను చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. రీసెంట్‌గా వచ్చిన ‘లైగర్’ అతని కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక హీరోయిన్ సమంత తన కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అనిపించుకున్నప్పటికీ రీసెంట్‌గా వచ్చిన ‘శాకుంతలం’ ఆమె కెరీర్‌లోనే బిగ్గస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ గురించి చెప్పాలంటే ‘నిన్నుకోరి, మజిలీ’ వంటి హిట్ సినిమాల తర్వాత నాని హీరోగా అతను చేసిన ‘టక్ జగదీష్’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దానికి లాక్‌డౌన్, ఓటీటీలో రిలీజ్ చేయడం వంటి కారణాలు వున్నప్పటికీ ఓటీటీలో కూడా ఈ సినిమాకి ఆదరణ కరవైంది.
ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఖుషి’ చిత్రానికి ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే గత చిత్రాల అపజయాల్ని దృష్టిలో పెట్టుకోకుండా అంతకుముందు వారు చేసిన సినిమాల ప్రభావం కూడా ఈ సినిమాపైన లేదనే చెప్పాలి. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంత స్టేజ్ మీద పెర్‌ఫార్మ్ చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా దాని గురించి ఎవ్వరూ డిస్కస్ చేసుకోకపోవడం కూడా ఆశ్చర్యమే. గతంలో విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే యూత్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూసేవారు. అలాగే సమంత సినిమా కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కూడా సెపరేట్‌గా ఉంటారు. ఇప్పుడు వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమాకి ఏమాత్రం బజ్ క్రియేట్ అవ్వకపోవడంతో సినిమా ఫలితం ఎలా ఉండబోతోందోనన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది. పవన్‌కళ్యాణ్ హీరోగా చేసిన ‘ఖుషి’ 2021లో రిలీజ్ అయి పవన్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. 22 సంవత్సరాల తర్వాత అదే పేరుతో వస్తున్న ఈ సినిమాకి టైటిల్ పరంగా, సినిమా పరంగా కూడా ప్రేక్షకుల్లో ఎలాంటి క్యూరియాసిటీ లేదు. మరి ఈ ‘ఖుషి’ ఏమేరకు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందో చూడాలి మరి.