English | Telugu

ముదురు భామలతో కుర్ర హీరోల రొమాన్స్‌.. ఎబ్బెట్టా? ఎస్సెట్టా?

ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ కూడా అంతే ముఖ్యం. కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ ఎంపిక విషయంలో, ఏ హీరోయిన్‌ అయితే సినిమాకి ప్లస్‌ అవుతుంది అనే విషయంలో ఒక క్లారిటీకి రావడానికి ఎంతో సమయం తీసుకుంటూ ఉంటారు మేకర్స్‌. సాధారణంగా హీరో కంటే వయసులో ఎంతో చిన్నవారైన వారినే  హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేస్తుంటారు. పాతతరం హీరోల సరసన దాదాపు మనవరాలి వయసులో వారిని తీసుకునేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. వయసుతో నిమిత్తం లేకుండా హీరో కంటే హీరోయిన్‌ పెద్దదైనా ఏమాత్రం వెనుకాడకుండా సెలెక్ట్‌ చేసేస్తున్నారు. కెమిస్ట్రీ పరంగా, లుక్‌ పరంగా అది ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది ఆలోచించడం లేదు. 
రాబోయే రెండు సినిమాల్లో హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. సెప్టెంబర్‌ 1న విడుదల కానున్న విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘ఖుషి’లో హీరోయిన్‌ సమంత. వయసు రీత్యా విజయ్‌ దేరకొండ కంటే సమంత రెండు సంవత్సరాలు పెద్దది. కెరీర్‌ పరంగా చూసినా విజయ్‌ కంటే సమంత సీనియర్‌. గతంలో వీరిద్దరూ కలిసి ‘మహానటి’ చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమాలో వారివి మెయిన్‌ క్యారెక్టర్స్‌ కావు. మరో సినిమా ‘మిస్‌ శెట్టి ` మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి సరసన అనుష్క హీరోయిన్‌గా నటించింది. వయసు రీత్యా నవీన్‌ కంటే అనుష్క 8 సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ జంటగా సినిమా అంటే కొంత అసహజంగానూ అనిపిస్తుంది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్‌లోనూ అదే గోచరిస్తుంది. మరి మేకర్స్‌ ఏ ధైర్యంతో వారిని సెలెక్ట్‌ చేశారో తెలీదు. ఏది ఏమైనా ఈ సినిమాల రిలీజ్‌ తర్వాత గానీ విషయం ఏమిటనేది అర్థం కాదు.