English | Telugu

అదే నిజమైతే.. అకీరా ఎంట్రీ ఖాయమేనా?

సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా వారసత్వం అనేది సర్వ సాధారణం. ముఖ్యంగా సినిమా రంగంలో వారసత్వానికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్.. ఇలా సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో ఉన్నవారు తమ వారసులు సైతం సినిమా రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. అలా పరిచయమైన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలను అందుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ కూడా తెరంగేట్రం చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని, అకీరాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని, హీరో అవ్వాలన్న ఆలోచన అస్సలు లేదని తల్లి రేణు దేశాయ్ అంటోంది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని ఆమె ఖండిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన అకీరాకు లేదని, ఒకవేళ అలాంటిదే జరిగితే ఆ విషయాన్ని మొదట తానే పోస్ట్ చేస్తానని చెబుతోంది. ఇదిలా ఉంటే అకీరా ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని, యాక్టింగ్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అది నిజమేనన్నట్టుగా ఇటీవల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అమెరికా వెళ్లినపుడు తన మనవడు కార్తికేయ, అకీరాలతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో పక్క  కె.రాఘవేంద్రరావుతో రేణు దేశాయ్ దిగిన ఫోటో కూడా హల్ చల్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 
గతంలో వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత హీరోలుగా వారు ఏ రేంజ్ కి వెళ్ళారో అందరికీ తెలిసిందే. అకీరా విషయానికి వస్తే.. ఇప్పుడు మళ్ళీ దర్శకేంద్రుడు మెగా ఫోన్ పట్టుకునే అవకాశం ఉందా? లేక ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో అకీరాను ఇంట్రడ్యూస్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త ఎంత వరకు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి.