English | Telugu

విజయ్‌ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం వచ్చే నెలలోనే..?

సినిమా తారలు ప్రేమలో పడడం, కొన్నాళ్ళు ప్రేమ పక్షుల్లా విహరించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు మీడియా ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. కొంతకాలంగా మీడియా దృష్టి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నలపైనే ఉంటోంది. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేస్తూ ఎన్నో ఆధారాలు కూడా చూపించాయి కొన్ని మీడియా సంస్థలు. ఈ విషయంలో విజయ్‌గానీ, రష్మికగానీ స్పందించలేదు. దీంతో ఇది నిజమేనన్న నిర్థారణకు వచ్చారంతా. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ చిత్రం రష్మికకు మంచి పేరు తెచ్చింది. బాలీవుడ్‌లో ఆమె పాపులారిటీ కూడా పెరిగింది. రూమర్లను స్ప్రెడ్‌ చేయడంలో బాలీవుడ్‌ మీడియా ఎప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించాలంటే బాలీవుడ్‌ మీడియా తర్వాతే. సినిమా అప్‌డేట్స్‌ కంటే సినిమా తారల వ్యక్తిగత జీవితాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టే అక్కడి మీడియా ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, రష్మికలను టార్గెట్‌ చేసింది. వారి ప్రతి కదలికను గమనిస్తూ వారి ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేసే పనిలో ఉంది. 

విజయ్‌, రష్మిక ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్‌లోని ప్రముఖ వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోబోతున్నారనే వార్తను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే ప్రేమలో మునిగి తేలుతున్న వీరు త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ జంట అధికారికంగా తమ ప్రేమ విషయాన్ని, పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తుందని సమాచారం.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిరదని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. ఇదిలా ఉండగా, రష్మిక మందన్న, కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి మధ్య  కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిచింది. 2017 జూలైలో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత గీతగోవిందంలో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్‌హిట్‌ కావడంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. రష్మిక, రక్షిత్‌ మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ, వారి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొని విడిపోయారు. 

ప్రస్తుతం విజయ్‌, రష్మికల ప్రేమ, పెళ్లి వార్త మాత్రం చాలా వేగంగా స్ప్రెడ్‌ అవుతోంది. ఎంతోకాలం నుంచి వీరికి సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరిలో ఎవరూ ఈ విషయం గురించి స్పందించే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. వారి మౌనాన్నే మీడియా అంగీకారంగా తీసుకుందో ఏమోగానీ, ఎప్పటికప్పుడు వారి గురించి కొత్త న్యూస్‌ను అందించే ప్రయత్నం చేస్తోంది.