English | Telugu
విజయ్ దేవరకొండ, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా..? షాకిచ్చిన రౌడీ హీరో, మాస్ డైరెక్టర్!
Updated : Feb 8, 2024
సినిమా రంగంలో కాంబినేషన్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాంబినేషన్‌తోనే సినిమాకి హైప్ వస్తుంది, ఆ కాంబినేషన్‌తోనే నిర్మాతకు బిజినెస్ వర్కవుట్ అవుతుంది. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న కాంబినేషన్‌లో ఒక సినిమా సెట్ అయ్యిదంటే.. అది ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ అయితే.. దాని గురించి ఇండస్ట్రీలో చర్చలు మామూలుగా ఉండవు. ఇప్పుడు అలాంటి ఒక రేర్ కాంబినేషన్, ఊహించని కాంబినేషన్ సెట్ అయ్యిందన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే బోయపాటి శ్రీను, విజయ్ దేవరకొండ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించరు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్‌ట్ పక్కా మాస్ ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకున్నాడట. అదే సమయంలో బోయపాటితో సినిమా ఓకే అయిందన్న వార్త వినిపిస్తోంది.
బోయపాటి శ్రీను సినిమాలంటే హై ఓల్టేజ్ యాక్షన్, పక్కా మాస్ క్యారెక్టర్, రక్తాన్ని పొంగించే డైలాగులు ఉంటాయి. ఇక విజయ్ దేవరకొండ కొన్ని మాస్ సినిమాలు చేసినప్పటికీ ఈ తరహా సినిమా ఇప్పటివరకు చెయ్యలేదనే చెప్పాలి. అందుకే రౌడీ హీరోకి సూట్ అయ్యేలా ఉంటూనే తన మార్క్ మాస్ మసాలాతో కూడిన సబ్జెక్ట్ రెడీ చేశాడట బోయపాటి. మరికొన్ని రోజుల్లో విజయ్‌కి నేరేషన్ ఇచ్చేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడని సమాచారం. అసలు ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందనే విషయంలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న దాన్ని బట్టి.. పుష్ప తర్వాత అల్లు అర్జున్‌తో గీతా ఆర్ట్స్‌లో బోయపాటి ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. అప్పటివరకు అనుకున్న ప్రాజెక్ట్ అది. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది. పుష్ప2తో ఇంకా బిజీ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప3 కూడా ఉంటుందంటున్నారు. ఈ ప్రాజెక్టుల దృష్ట్యా రెగ్యులర్ మాస్ సినిమాలు చేసే స్థితిలో బన్ని లేడు. పుష్ప సిరీస్ తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా చెయ్యాల్సి ఉంది. అంటే ఇప్పట్లో బోయపాటితో బన్ని సినిమా చేసే అవకాశం లేదు. అందుకే బోయపాటితో ఒక మాస్ కథ రెడీ చేయించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఏ హీరో అయితే బాగుంటుందని నెలరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ, ఎవరూ సెట్ అవ్వలేదు. ఆ పరిస్థితిలో విజయ్ దేవరకొండని అప్రోచ్ అయ్యారట.
‘గీత గోవిందం’ తర్వాతే విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ బేనర్‌లో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ, అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు దానికి సరైన సమయం వచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్ ఎలాగూ మాస్ సినిమా చెయ్యాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు విజయ్‌కి బోయపాటి మంచి ఆప్షనే అవుతాడు కదా. అలా ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందంటున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న బోయపాటికి విజయ్ దేవరకొండ కాంబినేషన్ అయినా సూపర్‌హిట్ ఇస్తుందేమో చూడాలి.