English | Telugu

‘కల్కి 2898ఎడి’ ఓవర్సీస్‌ రైట్స్‌ విషయంలో చుక్కలు చూపిస్తున్న అశ్వినీదత్‌?

టాలీవుడ్‌తోపాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ‘కల్కి’ రికార్డ్‌ క్రియేట్‌ చేయబోతోంది. భారీ బడ్జెట్టే కాదు, ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తుండడం మరో విశేషం. అలాగే దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, దిశా పటాని ఓ కీలక పాత్ర పోషిస్తోంది. 

‘కల్కి 2898ఎడి’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్‌ కాబోతోంది. అందులో ఇంగ్లీష్‌ కూడా ఉంది. ఇప్పటివరకు ఇండియా నుంచి ఎన్నో ఇంగ్లీష్‌ సినిమాలు హాలీవుడ్‌కి వెళ్లాయి. అయితే ఈ సినిమాని హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్‌ చేయబోతున్నారు. ఒక కమర్షియల్‌ సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉండడంతో మార్కెట్‌ పరంగా కూడా చాలా హైప్‌ క్రియేట్‌ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్‌ను ఇప్పటికే వైజయంతి మూవీస్‌ సంస్థ మొదలుపెట్టింది. మొదటిగా ఓవర్సీస్‌ హక్కుల కోసం రూ.100 కోట్లుగా ఒక రేట్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు. ఆ రేటు ఇస్తేనే రైట్స్‌ ఇస్తానని నిర్మాత స్పష్టంగా చెబుతున్నారని తెలుస్తోంది. అయితే ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు 70 నుంచి 80 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. 

నిర్మాత అశ్వినీదత్‌ ఆశించిన రేటు రాకపోతే సొంతంగానే ఓవర్సీస్‌లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఓవర్సీస్‌ రైట్స్‌ రూ.100 కోట్లు అంటే అదే స్థాయిలో ఇండియాలోనూ బిజినెస్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజమౌళి సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ఎంతో అధికంగా ‘కల్కి’ బిజినెస్‌ చెయ్యాలన్నది మేకర్స్‌ ఆలోచనగా కనిపిస్తోంది. నిర్మాత డిమాండ్‌ చేసినంత చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్‌ ఎవరూ రాకపోతే ఇండియాలోనూ సొంతంగానే రిలీజ్‌ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌, హై క్వాలిటీ స్టాండర్డ్స్‌ని బట్టే ఎవరూ ఊహించని స్థాయిలో నిర్మాత డిమాండ్‌ చేస్తున్నారట. ఇంతటి భారీ చిత్రాన్ని సొంతంగా రిలీజ్‌ చెయ్యాలనే డేరింగ్‌ డెసిషన్‌ తీసుకోబోతున్నారంటే సినిమా ఔట్‌పుట్‌ మీద వారికి ఉన్న అపారమైన నమ్మకమే కారణమని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ నిర్మాత అశ్వినీదత్‌ డిమాండ్‌ చేస్తున్నం ఎమౌంట్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఇవ్వడానికి రెడీ అయితే అత్యధిక బిజినెస్‌ చేసిన ఇండియన్‌ మూవీగా ‘కల్కి 2898ఎడి’ చిత్రంలో రికార్డు సృష్టించడం ఖాయం.