English | Telugu
మెగా సర్‌ప్రైజ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య..!
Updated : Feb 9, 2024
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి సినిమాలతో కూడా ఆ విజయపరంపరను కొనసాగించాలని భావిస్తున్నాడు. అందుకే అదిరిపోయే కాంబినేషన్స్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ-2' చేసే అవకాశముంది. ఇక తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'మిరపకాయ్', 'గబ్బర్ సింగ్' వంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజతో 'మిస్టర్ బచ్చన్' రూపొందించే పనిలో ఉన్న ఆయన.. త్వరలో బాలకృష్ణతో చేతులు కలపబోతున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
కాగా, చిరంజీవితో సైతం హరీష్ శంకర్ ఓ సినిమా చేయనున్నాడని.. చిరంజీవి కుమార్తె సుష్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. మరి చిరు, బాలయ్యలలో ఎవరి సినిమా ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.