English | Telugu

రాహుల్‌ విషయంలో అది నిజమేనంటారా?

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన వారు నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఎంతో మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు సక్సెస్‌ అయ్యారు, మరికొందరు మధ్యలోనే తమ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే వెళుతున్నాడు సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌. బిగ్‌బాస్‌ 3లో విన్నర్‌ నిలిచిన రాహుల్‌ ఆ తర్వాత సింగర్‌గా, యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఆస్కార్‌ వేదికగా పాట పాడి హాలీవుడ్‌ ప్రముఖులతోనూ స్టెప్పులేయించాడు. ఇప్పుడు రాహుల్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాహుల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం చివరి రోజు కావడంతో రాహుల్‌ దరఖాస్తు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అతను కాంగ్రెస్‌ పార్టీలో చేరకపోవడం, పొలిటికల్‌గా తను ఎంట్రీ ఇవ్వడంపై రాహుల్‌ అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల ఆ వార్త నిజం కాదేమోనని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి రాహుల్‌కి బిఆర్‌ఎస్‌ నాయకులతోనే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. అందునా కెటీఆర్‌, హరీష్‌రావులంటే అతనికి ఎంతో అభిమానం. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పోటీకి దిగుతాడనడం నమ్మశక్యంగా లేదు. మరి ఈ విషయంలో రాహుల్‌ మనోగతం ఏమిటి? ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతాడు, అసలు పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చే ఆలోచన అతనికి ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.