English | Telugu

‘సైంధవ్‌’కి, గోపీచంద్‌కి లింక్‌.. ఏ విషయంలో?

ఈమధ్యకాలంలో వెంకటేష్‌ ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమాలు చెయ్యడానికి ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్టు ఆయన సినిమాలు చెబుతున్నాయి. అయితే చాలా కాలం తర్వాత పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో ‘సైంధవ్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమా, పాన్‌ ఇండియా సినిమా ఇదే. ఈమధ్య ఎక్కువ ఫ్యామిలీ సినిమాలే చేయడం వల్ల ‘సైంధవ్‌’ వంటి యాక్షన్‌ మూవీ వెంకటేష్‌కి, ఆడియన్స్‌కి రిలీఫ్‌నిచ్చే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా సినిమాపై ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా ఉన్నాయి. ‘సైంధవ్‌’ తప్పకుండా సంక్రాంతి రేస్‌ని విన్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో హీరో కూతురు ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతూ ఉంటుంది. చికిత్స కోసం రూ.15 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్‌ అవసరం అవుతుంది. అదే ఇంజెక్షన్‌ విలన్‌కి కూడా అవసరం. దాని కోసం హీరో, విలన్‌ మధ్య పెద్ద పోరాటమే జరుగుతుందట. ఈ పాయింట్‌ వినగానే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఒక్కడున్నాడు’. అప్పట్లో ఈ సినిమా ఒక కొత్త పాయింట్‌తోనే రూపొందింది. బాంబే బ్లడ్‌ గ్రూప్‌ వున్న వ్యక్తి హార్ట్‌ విలన్‌కి కావాలి. దాని కోసం హీరో గోపీచంద్‌ని వెంటాడుతూ ఉంటుంది విలన్‌ గ్యాంగ్‌. వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు, విలన్‌ని ఎలా అంతమొందించాడు అనేది ఆ సినిమా కథ. బ్యాక్‌డ్రాప్‌లు వేరు అయినా ‘సైంధవ్‌’, ‘ఒక్కడున్నాడు’ కథలు ఒకేలా అనిపిస్తాయి. సైంధవ్‌ పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న అయితే.. ఒక్కడున్నాడు చిత్రాన్ని ఒక ఎక్స్‌పెరిమెంట్‌గానే ఆరోజుల్లో తీశారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ, టేకింగ్‌ స్టైల్‌ అన్నీ మారాయి కాబట్టి విన్న కథే అనిపించినా ‘సైంధవ్‌’ ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని అందిస్తుందనే చెప్పాలి.