English | Telugu

వెంకటేష్, నాని మల్టీస్టారర్.. రంగంలోకి టాప్ డైరెక్టర్!

మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, నాగ చైతన్య వంటి హీరోలతో తెరను పంచుకున్నాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా సమయం పడుతుంది. పైగా ప్రస్తుతం బన్నీ 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. దానికి తోడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీదకు వెళ్లడానికి ముందు, మరో సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ సైతం ఈ గ్యాప్ లో ఓ మూవీ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. దీనికోసం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు వినికిడి. ఇదొక మల్టీస్టారర్ అని, ఇందులో వెంకటేష్, నాని నటించే అవకాశముందని టాక్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి వెంకటేష్, నాని ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు. వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం ఎంటర్టైనర్స్ గా నిలిచిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ రచయిత. అందుకే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ మూవీ చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి నాని సరిగ్గా సరిపోతాడు. అందుకే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఒకే ప్రాజెక్ట్ కోసం ఈ ముగ్గురు చేతులు కలిపితే, ప్రకటనతోనే ఒక్కసారిగా అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.