English | Telugu
తమ్ముడి ఆస్తులు ఎంత.. ఆ లెక్కలు అన్నకే తెలుసు!
Updated : Nov 13, 2023
సాధారణంగా ఇప్పటి స్టార్ హీరోల జీవితాలు సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవి, వారి జీవన విధానం ఎలా ఉండేది అనే విషయాలను పరిశీలిస్తే.. పుట్టుకతోనే శ్రీమంతులైన హీరోలు తప్ప కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన హీరోలు తమ స్టయిల్‌ని మార్చుకున్నారు.. మార్చుకుంటున్నారు. అంతకుముందు సాదాసీదా జీవితాన్ని గడిపిన వారు హీరోలైన తర్వాత లగ్జరీయస్ లైఫ్‌ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఎన్ని కోట్లు సంపాదించినా సింపుల్‌గా ఉండేవారు, సాధారణ జీవితాన్ని కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. టాలీవుడ్‌లో వెంకటేష్‌లా జీవనశైలిని ఏర్పరుచుకున్నవారు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.
ఇటీవల రామ్‌చరణ్ దీపావళి పార్టీలో టాలీవుడ్ టాప్ హీరోలంతా తమ ఫ్యామిలీతో వచ్చి సందడి చేశారు. ఈ పార్టీకి వెంకటేష్ కూడా ఫ్యామిలీతోనే హాజరయ్యారు. అసలు విషయం ఏమిటంటే.. జనరల్‌గా వెంకటేష్ ఫోన్ వాడరు. అసలు చేతిలో ఫోన్ ఉండడానికి కూడా ఇష్టపడరు. కానీ, ఈ పార్టీలో ఫోన్‌తో కనిపించిన వెంకటేష్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కాస్త పరిశీలించి చూస్తే అది చాలా సాధారణమైన ఆండ్రాయిడ్ ఫోన్. పైగా ఆ ఫోన్ బ్రేక్ అయి ఉంది. మిగతా హీరోలంతా యాపిల్ ఫోన్స్‌లో రకరకాల మోడల్స్ వాడుతుంటే వెంకీ మాత్రం సాధారణ ఫోన్ ఉపయోగిస్తున్నారంటేనే అతని సింప్లిసిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఎంతో సాధారణంగా కనిపించే వెంకీ సింప్లిసిటీ గురించి పార్టీలో కొందరు చర్చించుకున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని చాలా మందికి తెలుసు. సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూలో సైతం సినిమా విశేషాల గురించి మాట్లాడిన తర్వాత ఆధ్యాత్మిక చింతన, మన జీవన విధానం ఎలా ఉండాలి.. వంటి అంశాల గురించే మాట్లాడతారు. ఆయనకు కోట్ల ఆస్తి ఉన్నా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్నా.. ఆ అమౌంట్ అందుకునేది మాత్రం అతని సోదరుడు సురేష్‌బాబేనని ఫిలింనగర్ ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇప్పటి వరకు వెంకీకి తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత ఉంది అనేది ఏ దశలోనూ తెలుసుకోవాలని ప్రయత్నం చేయరట. ఆస్తులు, అంతస్తులు, ఆర్భాటాలు.. వంటి వాటికి వెంకటేష్ ఎప్పుడూ దూరంగా ఉంటారు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఫాలోవర్‌గా ఉన్న వెంకటేశ్ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు.