English | Telugu
త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్.. వింటేజ్ డార్లింగ్ ని చూడబోతున్నాం!
Updated : Nov 16, 2023
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస భారీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ చేతిలో 'సలార్', 'కల్కి 2898 AD', మారుతి ప్రాజెక్ట్, 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ చేస్తున్నవి ఎక్కువగా యాక్షన్ సినిమాలు, భారీ సినిమాలు కావడంతో.. 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే త్వరలో వారి కోరిక నెరవేరే అవకాశముంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడని తెలుస్తోంది.
త్రివిక్రమ్, ప్రభాస్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ప్రభాస్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అందుకే మాటల మాంత్రికుడితో డార్లింగ్ ఓ సినిమా చేస్తే అదిరిపోతుందనేది ఫ్యాన్స్ భావన. ప్రభాస్ సైతం త్రివిక్రమ్ తో ఓ మంచి ఫ్యామిలీ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడట. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే బాధ్యతను ప్రభాస్ హోమ్ బ్యానర్ గా పేరున్న యూవీ క్రియేషన్స్ తీసుకుందట. గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ తన సినిమాలన్నీ హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే చేస్తున్నాడు. అందుకే ఆ బ్యానర్ తోనే కలిసి యూవీ ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చూస్తోందట.
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2024 సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్-త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. త్రివిక్రమ్ మాటలకు డార్లింగ్ కామెడీ టైమింగ్ తోడైతే అవుట్ పుట్ అదిరిపోతుంది అనడంలో డౌట్ లేదు.