English | Telugu
ఫ్యాన్సీ ఆఫర్‌కు ‘మంగళవారం’ చిత్రం ఓటీటీ హక్కులు?
Updated : Nov 15, 2023
ఈమధ్య థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఓటీటీలో సినిమాలు వస్తుండే సరికి ఆడియన్స్ కూడా థియేటర్స్ వైపు వెళ్ళకుండా ఇంట్లో నుంచే సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సమయంలోనే అది ఏ ఓటీటీలో రానుంది అనే సమాచారం అందుతోంది. దాంతో కొందరు ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్ళకుండా ఓటీటీలో వచ్చే ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘మంగళవారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా బాగా చెయ్యడం వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 17న ఈ సినిమా విడుదల కాబోతోంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంలో తన అందచందాలతో కుర్రకారుకి ఊపిరి ఆడకుండా చేసిన పాయల్ రాజ్‌పుత్ చేసిన కొత్త సినిమా ‘మంగళవారం’. దీంతో ఈ సినిమాకి థియేటర్స్‌లో స్పందన బాగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఫిలింనగర్‌లో ఈ సినిమా ఓటీటీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందించారు.