English | Telugu

రవితేజతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్న దర్శకులు!

రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈగిల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తనకు మరో హిట్‌ని అందిస్తుందని రవితేజ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గోపీచంద్‌ని ‘డాన్‌ శీను’తో డైరెక్టర్‌ని చేసిన రవితేజకు ఆ సినిమాను పెద్ద హిట్‌ చేశాడు. ఆ తర్వాత క్రాక్‌తో మరో సూపర్‌హిట్‌ ఇచ్చాడు. మూడో సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాలని గోపీచంద్‌ మలినేని చూస్తున్నాడు. రవితేజ కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట. 

ఇదిలా ఉంటే ‘ఈగిల్‌’ తర్వాత రవితేజతో సినిమా చేసేందుకు మరో ఇద్దరు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. వారిలో ఒకరు హరీష్‌ శంకర్‌ కాగా, మరొకరు అనిల్‌ రావిపూడి. నిజానికి ఇద్దరికీ పెద్ద ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అయితే రవితేజతో వెంటనే సినిమా చెయ్యాలనుకోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని మొదలు పెట్టిన హరీష్‌ శంకర్‌ ఆ సినిమాను ఇప్పట్లో పూర్తి అవ్వదని ఫిక్స్‌ అయ్యాడట. అందుకే ఈ గ్యాప్‌లో రవితేజతో సినిమా చెయ్యాలనుకుంటున్నాడు. ‘షాక్‌’తో తనను దర్శకుడ్ని చేసిన రవితేజతో ఇప్పుడు మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. మరో పక్క అనిల్‌ రావిపూడి కూడా రవితేజతోనే సినిమా చేసేందుకు సిద్ధపడుతున్నాడట. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ‘రాజా ది గ్రేట్‌’ అనే సినిమా చేసిన రవితేజకు మరో సూపర్‌హిట్‌ ఇవ్వగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. పోటీ పడుతున్న ఈ ఇద్దరు దర్శకుల్లో రవితేజ ఎవరికి ఛాన్స్‌ ఇస్తాడో, ఎవరితో సినిమా స్టార్ట్‌ చేస్తాడో చూడాలి.