English | Telugu

కథలు రెడీ.. హీరోలే లేరు.. ఇదీ ఆ స్టార్‌ డైరెక్టర్‌ పరిస్థితి!

విజయ్‌ దేవరకొండతో సందీప్‌రెడ్డి వంగా చేసిన ‘అర్జున్‌రెడ్డి’ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌సింగ్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేయగా.. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ అయింది.  ఈ రెండు సినిమాల తర్వాత రణబీర్‌ కపూర్‌తో చేసిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తూ ఇప్పటివరకు రూ.700 కోట్లు కలెక్ట్‌ చేసింది. హీరోకి డిఫరెంట్‌ ఇమేజ్‌ తీసుకురావడంలో సందీప్‌రెడ్డి పంథా వేరు. అర్జున్‌రెడ్డి, యానిమల్‌ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌ ఎంత పీక్స్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సందీప్‌రెడ్డి తన హీరోల ఇమేజ్‌ని మరింత పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో అందరూ గమనిస్తున్నారు. ‘యానిమల్‌’ తర్వాత సందీప్‌ చేయబోయే సినిమా ఏమిటి? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అతని తదుపరి సినిమా ఏ జోనర్‌లో ఉండబోతోంది? ఎలాంటి కంటెంట్‌తో ఆ సినిమా ఉంటుంది? ఈసారి ఏ హీరోని సెలెక్ట్‌ చేసుకుంటాడు? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తలెత్తుతున్నాయి. 

‘యానిమల్‌’ తర్వాత సందీప్‌రెడ్డి చేయబోయే సినిమా విషయంలో అతనికైనా క్లారిటీ ఉందా అంటే.. లేదనే మాటే వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రభాస్‌కి ఇప్పుడున్న  కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత అతనితోనే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని స్టార్ట్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా ఏమిటి? అనే విషయంలో తనకు క్లారిటీ లేదన్నాడు సందీప్‌. ఎందుకంటే తన దగ్గర కథలు రెడీగా ఉన్నాయని, హీరోలే సిద్ధంగా లేరని సమాధానమిచ్చాడు. సందీప్‌ చేయబోయే సినిమాల లిస్ట్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ, సందీప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించిన ప్రస్తావనే తేలేదు. దీంతో ప్రభాస్‌ హీరోగా సందీప్‌ చేయబోతున్న ‘స్పిరిట్‌’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుందన్న వార్త కేవలం రూమర్‌ తప్ప అందులో నిజం లేదనేది అర్థమవుతోంది. 

సందీప్‌రెడ్డిలాంటి దర్శకుడు సినిమా చేస్తాను అంటే సిద్ధంగా లేని హీరో ఉండడు అనేది వాస్తవం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతను చేసిన రెండు సినిమాలు అంతటి విజయాన్ని సాధించాయి. కథలు రెడీగా ఉన్నా హీరోలు మాత్రం సిద్ధంగా లేరు అని సందీప్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సందీప్‌ విషయంలో ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. అందులో నిజమెంత ఉందో తెలీదుగానీ, ‘యానిమల్‌’ సంచలన విజయాన్ని అందించిన సందీప్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ నిర్మాతలు క్యూ కడుతున్నారట. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోలను కాదని, బాలీవుడ్‌ హీరోలపైనే సందీప్‌ దృష్టి పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేదే ఆ వార్త.

‘యానిమల్‌’ కథని మొదట టాలీవుడ్‌ హీరోలకు వినిపించాడని, ఎవరూ చేయడానికి ముందుకు రాలేదట. అందుకే బాలీవుడ్‌కి వెళ్ళి రణబీర్‌తో ఈ సినిమా చేసాడని అంటున్నారు. అదే నిజమైతే ఇప్పట్లో టాలీవుడ్‌ హీరోలతో సందీప్‌రెడ్డి సినిమా చేసే అవకాశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.