English | Telugu
'దేవర'లో టాలీవుడ్ బిగ్ స్టార్ గెస్ట్ రోల్..!
Updated : Sep 26, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దేవర' (Devara). ఈ పాన్ ఇండియా మూవీ భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 27) థియేటర్లలో అడుగు పెట్టనుంది. విడుదలకు ముందే పలు సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'దేవర'కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
'దేవర' సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ గెస్ట్ రోల్ లో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ మహేష్ బాబు అయ్యుంటాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహేష్ కి అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల.. ఇద్దరితోనూ మంచి అనుబంధముంది. మహేష్, ఎన్టీఆర్ మధ్య బ్రదర్స్ లాంటి బాండింగ్ ఉంటుంది. ఇక కొరటాల దర్శకత్వంలో మహేష్ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాలు చేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కొరటాల అడిగితే.. గెస్ట్ రోల్ చేయడానికి మహేష్ ఏమాత్రం వెనుకాడడు.
అయితే దీని గురించి మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. 'దేవర'లో మహేష్ ది గెస్ట్ రోల్ కాదని, కేవలం వాయిస్ ఓవర్ అందించాడని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన 'బాద్షా'కి, అలాగే కొరటాల గత చిత్రం 'ఆచార్య'కు మహేష్ వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడే 'దేవర'కి కూడా వాయిస్ ఓవర్ అందించాడని వినికిడి.
మరి 'దేవర'లో మహేష్ గెస్ట్ రోల్ లో మెరుస్తాడా లేక వాయిస్ తో అలరిస్తాడా? లేదా అసలు ఈ న్యూస్ కేవలం ప్రచారానికే పరిమితమవుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.