English | Telugu
మరో రామాయణం చేయబోతున్న ప్రభాస్.. రెబల్‌స్టార్‌కి ఏమైంది?
Updated : Sep 28, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాహుబలి నుంచి కల్కి వరకు అన్ని సినిమాలూ వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రం షూటింగ్‌లో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత ఫౌజీ చిత్రం సెట్స్‌కి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పోర్షన్ కాకుండా మిగతా షూటింగ్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు హను రాఘవపూడి. అలాగే సలార్2, కల్కి2, స్పిరిట్ చిత్రాలు కూడా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రామాయణం కథాంశంతో రూపొందే సినిమాలో ప్రభాస్ నటించబోతున్నట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈవార్తలో ఎంత నిజముందో తెలీదుగానీ, ఆ సినిమాకి సంబంధించిన విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది.
విషయం ఏమిటంటే.. రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ‘రామాయణ’ చిత్ర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. నితిష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పరశురాముడి పాత్రకు ప్రభాస్ ఫిజిక్ పర్‌ఫెక్ట్ సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు డార్లింగ్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రపోజల్‌కి ప్రభాస్ ఓకే చెప్పాడా లేదా అనే విషయం తెలియరాలేదు. రణబీర్ కపూర్, సాయిపల్లవి వంటి స్టార్స్ నటిస్తున్న రామాయణ చిత్రానికి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కూడా యాడ్ అయితే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ చెయ్యబోతున్నాడు అనే వార్త డార్లింగ్‌కి ఫ్యాన్స్ మంచి వార్తే అయినా వారిలోనే కొందరు మాత్రం ఈ విషయంలో అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.
ఎందుకంటే.. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో అందరికీ తెలిసిందే. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే రామాయణ ఇతిహాసాన్ని సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఓం రౌత్ అపహాస్యం చేశాడని తీవ్రంగా విమర్శించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓం రౌత్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. రామాయణం విషయంలో గతంలో అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసిన తర్వాత కూడా అదే కథాంశంతో కూడిన సినిమాలో ప్రభాస్ నటించడం పట్ల కొందరు డార్లింగ్ ఫ్యాన్స్‌లో వ్యతిరేకత కనిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ‘రామాయణ’లో ప్రభాస్ నటించనున్నాడన్న వార్తలో ఎంత నిజం ఉంది? అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.