English | Telugu

బన్నీకి ఈసారి బాబు ఎవరు?

'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'.. చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరి కలయికలో మరో చిత్రం రానుంది.  గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు.

ఇదిలా ఉంటే, బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న నాలుగో చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. తండ్రి పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఆ స్టార్ ఎవరో క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నింటిలోనూ ఫాదర్ క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. 'జులాయి'లో తనికెళ్ళ భరణి తండ్రిగా నటించగా.. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ప్రకాశ్ రాజ్ నాన్నగా కనిపించారు. ఇక 'అల వైకుంఠపురములో' విషయానికి వస్తే.. జయరామ్ కన్నతండ్రిగా, మురళీ శర్మ పెంపుడుతండ్రిగా దర్శనమిచ్చారు. మరి.. ఈ సారి బన్నీకి ఎవరు బాబు అవుతారో చూడాలి.

కాగా, ప్రస్తుతం 'పుష్ప ది రూల్'లో నటిస్తున్నాడు అల్లు అర్జున్. వచ్చే ఏడాది వేసవికి ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు.. త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది.