English | Telugu

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబోలో మరో మూవీ!

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప-1'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 'పుష్ప-2' తర్వాత ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతంలో 'రేసు గుర్రం' సినిమా వచ్చింది. 2014లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఘన విజయం సాధించింది. దీంతో వీరి కాంబోలో మరో సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అన్నీ అనుకున్నట్లు కుదిరితే 'పుష్ప-2' తర్వాత బన్నీ-సురేందర్ రెడ్డి కలయికలో సినిమా వచ్చే అవకాశముందని అంటున్నారు.

ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో 'ఏజెంట్' చిత్రాన్ని చేస్తున్న సురేందర్ రెడ్డి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ దాదాపు అటక ఎక్కినట్లేనని టాక్. మరోవైపు నితిన్ తో సినిమా ఉందని కూడా వార్తలొచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా బన్నీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. బన్నీ కోసం సురేందర్ రెడ్డి ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలాంటి కథ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.