English | Telugu

'జై హనుమాన్'లో ఆ స్టార్ హీరో!

బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' సృష్టిస్తున్న సంచలనాలకు ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హీరో ఫిల్మ్.. చిన్న సినిమాగా విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, రూ.300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న 'జై హనుమాన్'పై పడింది.

'హనుమాన్' సినిమా చివరిలో దీనికి సీక్వెల్ గా 'జై హనుమాన్' రానుందని, ఇది 2025 లో విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం నాడు ఈ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే 'జై హనుమాన్' చిత్రం అనేది 'హనుమాన్'ని మించి ఎన్నో రెట్లు ఉంటుందని, హనుమంతుడి పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పాడు. అంతేకాదు హనుమంతుడి పాత్రని ఒక స్టార్ హీరో పోషిస్తాడని కూడా పేర్కొన్నాడు. దీంతో ఆ స్టార్ ఎవరా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్ర పోషించబోయేది రానా దగ్గుబాటి అని తెలుస్తోంది.

విభిన్న సినిమాలు, పాత్రలు చేయడంలో రానా ఎప్పుడూ ముందుంటాడు. విలన్ పాత్రలు, ప్రత్యేక పాత్రలు పోషించడానికి కూడా వెనుకాడడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించాడు. అందుకే రానాకి పాన్ ఇండియా గుర్తింపు ఉంది. ముఖ్యంగా 'బాహుబలి'లో భల్లాలదేవగా ఆయన నటనను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. పైగా చారిత్రక, పౌరాణిక పాత్రలకు సరిగ్గా సరిపోతాడు. అందుకే బలమైన హనుమంతుని పాత్ర కోసం ప్రశాంత్ వర్మ రానాని ఎన్నుకున్నట్లు సమాచారం. రానా సైతం జై హనుమాన్ లో నటించడానికి వెంటనే ఓకే చెప్పినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.