English | Telugu

లారెన్స్, శ్రీవాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ!

కొంతకాలంగా బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు హీరోలు, దర్శకులు భారీ బడ్జెట్ సినిమాలు చేసి వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే వీటిలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒక ఊహించని కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కాంబినేషన్ ఎవరో కాదు దర్శకుడు శ్రీవాస్, మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్.

'లక్ష్యం'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీవాస్.. ఆ తర్వాత ఆ జోరుని కొనసాగించలేకపోయాడు. 'లక్ష్యం' తర్వాత ఆయన దర్శకత్వంలో ఆరు సినిమాలు రాగా, అందులో 'లౌక్యం' మాత్రమే ఘన విజయం సాధించింది. శ్రీవాస్ గత రెండు చిత్రాలు 'సాక్ష్యం', 'రామబాణం' ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఆయన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన లారెన్స్ తో చేతులు కలపబోతున్నట్లు సమాచారం.

కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా లారెన్స్ కి తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కొంతకాలంగా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా హారర్ సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల 'చంద్రముఖి-2'తో నిరాశపరిచిన లారెన్స్.. త్వరలో 'జిగర్తాండ డబుల్ ఎక్స్'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి లారెన్స్ అంగీకరించాడని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుందని వినికిడి. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.