English | Telugu
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాగశౌర్య!
Updated : Oct 11, 2023
'కొత్త బంగారు లోకం'తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. రెండో సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మరో సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఆ తర్వాత 'ముకుంద'తోనూ మెప్పించాడు. అనంతరం 'బ్రహ్మోత్సవం' రూపంలో ఘోర పరాజయం ఎదురుకావడంతో కొన్నేళ్లు డైరెక్షన్ కి దూరమయ్యాడు. ఎట్టకేలకు 'నారప్ప'తో అవకాశం వచ్చి దర్శకుడిగా మెప్పించినప్పటికీ అది నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో పెద్దగా పేరు రాలేదు. ఇక ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న 'పెదకాపు-1' ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఆ షాక్ తో 'పెదకాపు-2' నిర్మించే సాహసం నిర్మాతలు చేయరు. దీంతో ఇప్పట్లో శ్రీకాంత్ దర్శకత్వంలో మరో సినిమా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఊహించని విధంగా ఆయనకు యంగ్ హీరో నాగశౌర్యతో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
కెరీర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ హీరోగా కనిపించిన నాగశౌర్యకి కొన్నేళ్లుగా సరైన విజయాలు దక్కడం లేదు. 'ఛలో' తర్వాత శౌర్య సాలిడ్ సక్సెస్ చూడలేదు. ఈ ఏడాది విడుదలైన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'రంగబలి' సినిమాలు అతనికి చేదు ఫలితాలనే మిగిల్చాయి. ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఎలాగైనా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతను శ్రీకాంత్ అడ్డాలతో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఇటీవల శౌర్యను కలిసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో శౌర్య ఫ్యామిలీకి చెందిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇది శ్రీకాంత్ అడ్డాల మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని వినికిడి.