English | Telugu

'పుష్ప-2' ఐటెం సాంగ్ లో శ్రీలీల!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబరులో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. ఇందులోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, పాటలు విశేష ఆదరణ పొందాయి. ఇక 'ఊ అంటావా మావ' అనే ప్రత్యేక గీతమైతే ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ఈ పాటలో చిందేసిన సమంత తన గ్లామర్, డ్యాన్స్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసింది. రెండో భాగంగా వస్తున్న 'పుష్ప: ది రూల్' లోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చిత్ర బృందం  గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

బన్నీ, సుకుమార్ కలయికలో ప్రస్తుతం 'పుష్ప-2' రూపొందుతోంది. 'పుష్ప-1' తరహాలోనే ఇందులోనూ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరోసారి ఐటెం సాంగ్ హైలైట్ కానుందని అంటున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. తన డ్యాన్స్ లతో అతికొద్దికాలంలోనే శ్రీలీల యూత్ కి ఎంతలా చేరువైందో తెలిసిందే. అందుకే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే ఆమె చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'పుష్ప-2'లో ప్రత్యేక గీతం కోసం చిత్రం బృందం ఆమెని సంప్రదించిందట. భారీ అంచనాలున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఇది శ్రీలీలకు మంచి ఆఫర్ అనే చెప్పాలి. శ్రీలీల సైతం ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మ్యాజిక్ చేస్తుంది అనడంలో సందేహంలేదు. 

కాగా ఆహా యాడ్ కోసం ఇప్పటికే బన్నీతో కలిసి పని చేసింది శ్రీలీల. ఇప్పుడు బన్నీ సినిమాలో ప్రత్యేక గీతంలో కనువిందు చేసే అవకాశం వచ్చిందని న్యూస్ వినిపిస్తోంది. మరి భవిష్యత్ లో బన్నీకి జోడిగా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంటుందేమో చూడాలి.