English | Telugu
బిగ్ సర్ ప్రైజ్.. చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ కాంబోలో మూవీ!
Updated : Jul 27, 2023
తన చిన్న మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా రేపు(జూలై 28న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సాయి తేజ్ కి డబుల్ ధమాకా తగిలిందని న్యూస్ వినిపిస్తోంది. 'బ్రో' రూపంలో చిన్న మేనమామతో తెరను పంచుకునే అవకాశాన్ని పొందిన సాయి తేజ్, త్వరలో తన పెద్ద మేనమామ మెగాస్టార్ చిరంజీవితో తెరను పంచుకునే అవకాశముందని అంటున్నారు.
ఆగస్టు లో 'భోళా శంకర్'తో అలరించనున్న చిరంజీవి తన తదుపరి సినిమాని 'బంగార్రాజు' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మించనున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా త్రిష నటించనుండగా, మరో యువ జంటకు ఈ సినిమాలో స్థానముంది. మొదట్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల జోడి సందడి చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే ఏవో కారణాల వల్ల సిద్ధు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో మరో యువ హీరోని వెతికే పనిలో పడింది చిత్రబృందం. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ని రంగంలోకి దింపితే బాగుంటుందనే ఆలోచన వారికి వచ్చిందట. మెగాస్టార్ సినిమా అంటే సాయి తేజ్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్తాడు అనడంలో సందేహం లేదు. మరి నిజంగానే సాయి తేజ్ ఈ సినిమాలో భాగమైతే మాత్రం వరుసగా ఇద్దరు మేనమామలతో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న వాడవుతాడు.