English | Telugu

మెగా మూవీ నుంచి తప్పుకున్న డీజే టిల్లు!

ఆగస్టు లో 'భోళా శంకర్'తో అలరించనున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాని 'బంగార్రాజు' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో మెగాస్టార్ కి జోడిగా త్రిష నటించనుండగా, కీలక పాత్రల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల సందడి చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధు ఆసక్తి చూపించట్లేదని ఇన్ సైడ్ టాక్.

సిద్ధు దశాబ్దం పైనుంచే సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ సమయంలో వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీలా', 'మా వింత గాధ వినుమా' వంటి ఓటీటీ సినిమాలు అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక గతేడాది థియేటర్లలో విడుదలైన 'డీజే టిల్లు' అతని ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం అతను 'డీజే టిల్లు' సీక్వెల్ గా తెరకెక్కుతోన్న 'టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశమొచ్చింది. మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమే అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న తను ఇప్పుడు మళ్ళీ ఇతర హీరోల సినిమాల్లో నటిస్తే అది కెరీర్ పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నాడట. అందుకే మెగాస్టార్ మూవీ ఆఫర్ ని అతను సున్నితంగా తిరస్కరించాడట. సిద్ధు నో చెప్పడంతో ఇప్పుడు అతని స్థానంలో మరో యంగ్ హీరోని వెతికే పనిలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఉన్నట్లు సమాచారం.